- తీవ్ర గాయాలతో దవాఖానలో చేరిన చిగురుమామిడి ఎమ్మార్వో ..
- మరో ఆరుగురిపైనా అటాక్
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ కలెక్టరేట్‌లో కుక్కలు శుక్రవారం హల్ చల్ చేశాయి. చిగురుమామిడి తహసీల్దార్ నరేందర్‌ను ఓ పిచ్చికుక్క కరవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో ఆయనను సిబ్బంది హాస్పిటల్‌కు తరలించారు. ఆయనతో మరో ఆరుగురిని కూడా కుక్కలు కరిచాయని చెప్పారు. మున్సిపల్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో కుక్కలను బంధించారు. కొద్ది రోజులుగా కలెక్టరేట్‌లో కుక్కుల హల్చల్ చేస్తుండడంతో వివిధ పనుల కోసం
వచ్చేవారు భయపడుతున్నారు.
తాడ్వాయిలో బాలికపై..
తాడ్వాయి: కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం సోమారంతండాలో ఇంటి పక్కన ఆడుకుంటున్న బానోత్ శైలజ(7)పై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. పాప అరుపులు విన్న తల్లిదండ్రులు రాజేశ్, జ్యోతి బయటకు రావడంతో కాపాడగలిగారు. తల, నుదుటిపై గాయాలు కావడంతో కామారెడ్డి ఏరియా దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ లోని నిలోఫర్ హాస్పిటల్‌కు పంపించారు.