
రాష్ట్ర వ్యాప్తంగా వీధి కుక్కల దాడులు రోజురోజుకి ఎక్కువవుతున్నాయి. మనుషులపై దాడి చేస్తున్న ఘటనలు నిత్యం ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి . ఇవాళ కొంపల్లి మున్సిపల్ పరిధి 9వ వార్డులో వీధి కుక్కలు మరోసారి స్వైర విహారం చేశాయి. ఇంటి ముందు ఆడుకుంటున్న రమ్యా కుమారి (7)పై ఐదు వీధి కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయాలయ్యాయి. రక్తపు మడుగులో ఉన్న ఆ చిన్నారిని చికిత్స కోసం స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
గత నెల 11 న తనుశ్రీ (5) అనే బాలికను కూడా వీధి కుక్కలు విచక్షణారహితంగా దాడి చేశాయి. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆ బాలిక ఇప్పటికీ కోలుకోలేదు. అయితే మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.