గ్రేటర్లో మళ్లీ రెచ్చిపోతున్న వీధికుక్కలు.. ఆడుకుంటున్న పిల్లాడిపై దాడి

గ్రేటర్లో మళ్లీ రెచ్చిపోతున్న వీధికుక్కలు.. ఆడుకుంటున్న పిల్లాడిపై దాడి

మీ పిల్లలు ఇంటి బయట ఆడుతున్నారా..? వారిని తరచూ గమనిస్తూ ఉండండి.. లేదంటే మీ ఇంటి దగ్గరలో ఉండే వీధికుక్కలు దాడి చేసే ప్రమాదం ఉంది.. మళ్లీ గ్రేటర్ హైదరాబాద్ లో వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. గురువారం (డిసెంబర్ 14న) హైదరాబాద్ దిల్షుక్నగర్ లో జరిగిన ఒక ఘటన కలకలం రేపుతోంది. ఆరేళ్ల బాలుడిపై వీధికుక్క దాడి చేసింది. 

దిల్షుక్నగర్ పీఎన్టీ కాలనీ శాంతినగర్ వీధిలో ఇంటి ముందు ఆడుకుంటున్న ముగ్గురు పిల్లలపై వీధి కుక్కలు దాడికి ప్రయత్నించాయి. వాటిని చూసి చిన్నారులు భయంతో గేటు నుంచి ఇంట్లోకి వెళ్లేందుకు పరుగెత్తారు. ఇదే సమయంలో రెండు కుక్కలు అక్కడి నుంచి అటే వెళ్లిపోయాయి. ఒక కుక్క మాత్రం గేటు లోపలికి వచ్చి మరీ.. ఆరేళ్ల బాలుడి కాలును కరిచింది. ఇంతలోనే పిల్లల అరుపులు ఉన్న కుటుంబ సభ్యులు ఏం జరిగిందోనని భయంతో పరుగెత్తుకుంటూ బయటకు వచ్చారు. కుక్క దాడిలో కింద పడిపోయిన బాలుడిని ఒక మహిళ దగ్గరకు తీసుకుంది. మిగతా ఇద్దరు పిల్లలు, మరో వ్యక్తి.. దాడి చేసిన కుక్కను తరిమికొట్టారు.

ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు సేఫ్. ఒక బాలుడికి మాత్రం స్వల్ప గాయాలయ్యాయి. గాయపడ్డ బాలుడిని వెంటనే నీలోఫర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నాడు పిల్లాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఏర్పాటు చేసిన సీసీ టీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డు అయ్యాయి.  

మరో ఘటనలో 13 ఏళ్ల బాలిక మృతి

మరో ఘటనలో 13 ఏళ్ల బాలిక చికిత్స పొందుతూ చనిపోయింది. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో కోమళ్ల మహేశ్వరి అనే 13 ఏళ్ల బాలిక మృతి చెందింది. పోచమ్మపల్లి ప్రభుత్వ మోడల్‌ స్కూల్‌లో 7వ తరగతి చదువుతున్న మహేశ్వరి.. మానకొండూరు మండల కేంద్రంలోని పోచమ్మపల్లి గ్రామ శివారులో ఉన్న తమ ఇంటి బయట హోంవర్క్‌ చేస్తుండగా వీధికుక్కలు దాడి చేశాయి. దాదాపు 40 రోజుల పాటు చికిత్స తీసుకున్నప్పటికీ.. ఆమె గాయాల నుండి బయటపడలేదు. చికిత్స పొందుతూ చనిపోయింది. 

గతంలో తెలంగాణలో వీధికుక్కల దాడుల్లో పలువురు చిన్నారులు చనిపోయిన ఘటనలు చూశాం. ఇలాంటి తరహా ఘటనలు మళ్లీ జరుగుతుండడం సర్వత్రా ఆందోళన కల్గిస్తోంది. హైదరాబాద్‌లో వీధికుక్కల దాడులను అరికట్టాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. కుక్కల దాడులు కొనసాగుతున్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత అధికారులు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.