- ప్రజావాణిలో ఫిర్యాదు చేద్దామని వస్తే లోపలికి పంపించడం లేదని ఆందోళన
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఆపరేషన్ రోప్ తో తాము రోడ్డున పడుతున్నామని సోమవారం పలువురు స్ట్రీట్ వెండర్లు జీహెచ్ఎంసీ హెడ్డాఫీస్వద్ద ఆందోళనకు దిగారు. దాదాపు 200 మంది వీధి వ్యాపారులు అక్కడ బైఠాయించి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిటీలో రోజుకోచోట ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.
స్ట్రీట్వెండర్లను ఆదుకుంటామని చెప్పి, ఇలా ఎందుకు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు పక్కన తోపుడు బండ్లు పెట్టుకుంటే తొలగిస్తున్నారని, ఫైన్స్ వేస్తూ ఇబ్బందులు పెడుతున్నారని, ప్రజావాణిలో ఫిర్యాదు చేద్దామని వస్తే లోపలికి పంపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పోలీసులు, మున్సిపల్ అధికారులు రోడ్డు పక్కన వ్యాపారాలు చేసుకొనివ్వడం లేదని, కాలనీల్లో పెట్టుకున్న బండ్లను సైతం ఎత్తుకుపోతున్నారని ఆరోపించారు. జేసీబీలతో తోపుడు బండ్లను కూల్చేస్తున్నారని, తాము ఎలా బతకాలని ప్రశ్నించారు. ట్రాఫిక్ కి ఇబ్బంది లేకుండా వ్యాపారాలు చేసుకుంటామన్నా వినిపించుకోవడం లేదన్నారు. సిటీలో స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ అమలు చేయట్లేదని ఆరోపించారు.
