
ఆసిఫాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో రూల్స్ కచ్చితంగా పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో అడిషనల్ కలెక్టర్లు దీపక్ తివారి, ఎం.డేవిడ్ తో కలిసి ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల ఎన్నికల నిర్వహణపై అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహిస్తామని తెలిపారు. మొదటి విడతలో 8, రెండో విడతలో 7 మండలాలకు, ఆ తర్వాత సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుపుతామని పేర్కొన్నారు. పోలింగ్ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుందని, మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని చెప్పారు.
ఉపసర్పంచ్ ఎన్నిక అదే రోజు జరుగుతుందన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని, సభలు, సమావేశాల కోసం ముందస్తు అనుమతి తీసుకోవాలని సూచించారు.
ఎన్నికలు సజావుగా నిర్వహించాలి
నస్పూర్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లో అడిషనల్కలెక్టర్ (రెవెన్యూ) చంద్రయ్య, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, డీపీవో వెంకటేశ్వర్ రావు, జడ్పీ సీఈవో గణపతి, డీఈవో యాదయ్య, డీడబ్ల్యూవో రవూఫ్ఖాన్, నోడల్ ఆఫీసర్లతో కలిసి రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు ఎన్నికల నిర్వహణపై ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నామినేషన్లు, అభ్యర్థుల తుది జాబితా, పోస్టల్ బ్యాలెట్ పంపిణీ, ఫొటో ఓటర్ స్లిప్పుల పంపిణీ, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు, ఓటింగ్ నిర్వహణ, ఫలితాల ప్రకటన తదితర అంశాలపై అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. అనంతరం పాత మంచిర్యాల ప్రాంతంలో నిర్మిస్తున్న ఇందిరా మహిళా శక్తి భవన్ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. మంగళవారం భవన పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు.
పోలింగ్ కేంద్రాల్లో వసతులు కల్పించండి
నిర్మల్, వెలుగు: జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో అధికారులతో సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని చెప్పారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున గ్రామాల్లో రాజకీయ ఫ్లెక్సీలు, వాల్ పెయింటింగ్స్ ఉండకూడదన్నారు. రాజకీయ పార్టీల కార్యక్రమాలకు అధికారుల అనుమతి తప్పనిసరని పేర్కొన్నారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద ఇప్పటికే చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని, అధికారులు ఎప్పటికప్పుడు వాటిని తనిఖీ చేస్తూ ఉండాలని సూచించారు.
రూట్ అధికారులు పోలింగ్ కేంద్రాలకు ముందుగానే వెళ్లి, ఆయా మార్గాల్లో ఏవైనా ఇబ్బందులున్నాయేమో చూడాలన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతులు కల్పించాలని చెప్పారు. అడిషనల్కలెక్టర్(స్థానిక సంస్థలు) ఫైజాన్ అహ్మద్, ఆర్డీవో రత్నకల్యాణి, జెడ్పీ సీఈవో గోవింద్, డీపీవో శ్రీనివాస్, సీపీవో జీవరత్నం తదితరులు పాల్గొన్నారు.