అగ్రంపహాడ్ జాతరలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు : ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి

 అగ్రంపహాడ్ జాతరలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు : ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి

శాయంపేట(ఆత్మకూర్), వెలుగు: మినీ మేడారంగా ప్రసిద్ధి చెందిన అగ్రంపహాడ్ జాతరలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్​రెడ్డి, హనుమకొండ కలెక్టర్​ స్నేహా శబరీశ్​ హెచ్చరించారు. మంగళవారం అగ్రంపహాడ్​ జాతర ఏర్పాట్లను వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం దేవాదాయ, రెవెన్యూ, విద్యుత్, వైద్య పంచాయతీ రాజ్, ఆర్డబ్ల్యూఎస్, పోలీస్ శాఖల తోపాటు ఎక్సైజ్, అగ్నిమాపక, సాగునీటిపారుదల, మత్స్యశాఖ అధికారులతో శాఖల వారీగా పురోగతిని సమీక్షించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కలిసి జాతరను విజయవంతం చేయాలన్నారు. లక్షలాది మంది భక్తులు సమ్మక్క సారలమ్మను దర్శించుకుంటారని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు 24 గంటలు పనిచేసే విధంగా సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు.

పారిశుధ్య నిర్వహణకు 152 మంది పారిశుధ్య కార్మికులను కేటగిరీలుగా చేసి 24 గంటల పాటు శానిటేషన్ నిర్వహిస్తామన్నారు. ఆత్మకూరులో ప్రత్యేకంగా 10 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేశామని, పోలీస్ శాఖ ద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్ తో పాటు 150 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సమావేశంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి నాగేశ్వర రావు, పరకాల ఆర్డీవో కన్నం నారాయణ, ఆర్అండ్ బీ ఈఈ సురేశ్​బాబు, పరకాల ఏసీపీ సతీశ్​బాబు,  పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఈఈ ఆత్మారాం, సాగునీటిపారుదల శాఖ ఈఈ సునీత, ఆత్మకూర్ తహసీల్దార్ జగన్మోహన్ రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి, ఏపీఓ దుంపల రాజిరెడ్డి, అగ్రం పహాడ్, అక్కంపేట సర్పంచులు మహేందర్, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు