
- గ్రేటర్ లోని 24 హాస్పిటళ్ల స్టాఫ్ కు 2 నెలలుగా జీతాలు ఇస్తలే
- డీఎంఈకి ఔట్సోర్సింగ్ స్టాఫ్ ఫిర్యాదు
- 17లోపు జీతాలు చెల్లించాలె.. లేకుంటే సమ్మె చేస్తామని హెచ్చరిక
- 4 వేల మందికి జీతాలు ఆపేసిన కాంట్రాక్ట్ సంస్థ ఏజిల్
- ఏజిల్ ను తొలగించాలని కార్మికుల డిమాండ్
హైదరాబాద్, వెలుగు: సర్కార్ దవాఖాన్లలో పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు విధుల బహిష్కరణకు పిలుపునిచ్చారు. కాంట్రాక్టర్ తమకు 2 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని వారు సోమవారం మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ (డీఎంఈ) డాక్టర్ రమేశ్రెడ్డికి ఫిర్యాదు చేశారు. బుధవారంలోగా జీతాలు ఇవ్వకపోతే, గురువారం నుంచి ఆందోళనలు చేపడతామని, అవసరమైతే సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 24 దవాఖాన్లలో పని చేస్తున్న 4 వేల మంది ఔట్సోర్సింగ్ స్టాఫ్ ఈ సమ్మెకు మద్దతు ప్రకటించారు. ఈ 24 దవాఖాన్లలో సెక్యూరిటీ, శానిటేషన్, పేషెంట్కేర్ వ్యవస్థను ఏజిల్ అనే కాంట్రాక్ట్ సంస్థ నిర్వహిస్తోంది. ప్రభుత్వం నుంచి నిధులు రాలేదని, అందుకే జీతాలు ఇవ్వడం కుదరదని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారని కార్మికులు ఫిర్యాదులో పేర్కొన్నారు. జీతాల గురించి గట్టిగా అడిగితే ఉద్యోగంలో నుంచి తీసేస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏజిల్ కాంట్రాక్ట్ రద్దు చేయాలె
ఏజిల్ సంస్థ కాంట్రాక్ట్ను రద్దు చేయాలని ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, వర్కర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ర్టక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్(టీఎస్ఎంఎస్ఐడీసీ) ఎండీ చంద్రశేఖర్రెడ్డికి సోమవారం వినతిపత్రం ఇచ్చారు. సంస్థ కాంట్రాక్ట్ గడువు ముగిసి ఏడాది కావొస్తోందని, అయినా అదే సంస్థను కొనసాగించడం వల్ల తాము నష్టపోతున్నామని వారు తెలిపారు. ఏజిల్ సంస్థ ఇప్పటికీ తమకు నాలుగేండ్ల కిందటి లెక్క ప్రకారమే వేతనాలు ఇస్తోందన్నారు. ఆరు నెలలకోసారి డీఏతో కలపి జీతాలు చెల్లించాల్సి ఉండగా, అది కూడా ఇవ్వడం లేదన్నారు. కాంట్రాక్ట్ రూల్స్ ప్రకారం ఏడాదికి రెండు జతల యూనిఫాం ఇవ్వాల్సి ఉండగా, రెండేండ్లుగా అవి కూడా ఇవ్వడం లేదన్నారు. చిరిగిపోయిన దుస్తులతోనే డ్యూటీలకు హాజరవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పీఎఫ్ కూడా సరిగా కట్టడం లేదని కంప్లైంట్ చేశారు. సాధ్యమైనంత త్వరగా ఏజిల్ కాంట్రాక్ట్ను రద్దు చేసి, కొత్తగా టెండర్లు పిలవాలని, కనీస వేతనం రూ.21 వేలుగా నిర్ణయించాలని ఎండీకి విజ్ఞప్తి చేశారు.
జీతాలు ఇయ్యకుంటే బతుకుడెట్లా?
ఔట్సోర్సింగ్ సిబ్బందికి ఇచ్చేదే అత్తెసరు జీతాలు. అవి కూడా టైంకి ఇస్తలేరు. నెల నెలా జీతాలు వస్తేనే ఇల్లు గడవని పరిస్థితిలో ఉన్నరు. రెండు నెలలుగా జీతాలు ఇయ్యకపోవడంతో సరుకులు కొనేందుకూ అప్పులు చేయాల్సి వస్తోంది. పిల్లల బడులు స్టార్ట్ అయినయి. వాళ్లకు పుస్తకాలు కూడా కొనలేక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నరు. అందుకే ఆందోళనకు పిలుపునిచ్చినం. నాలుగైదు రోజులు చూసి సమ్మెకు దిగుతాం. ఎం. నర్సింహా, ప్రెసిడెంట్, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్