కొత్త సెక్రటేరియెట్​లో స్ట్రాంగ్ రూమ్స్

కొత్త సెక్రటేరియెట్​లో స్ట్రాంగ్ రూమ్స్
  • ఫైల్స్ దాచేందుకు ఏర్పాటు..  పనులను పరిశీలించిన కేసీఆర్ 

  • కొత్త బిల్డింగ్ అమరుల త్యాగ ఫలితమేనన్న సీఎం 

హైదరాబాద్, వెలుగు: కొత్తగా నిర్మిస్తున్న సెక్రటేరియెట్​లో ఫైళ్లను దాచిపెట్టేందుకు స్ట్రాంగ్ రూమ్స్ నిర్మిస్తున్నారు. అడుగడుగునా కదలికలను పసిగట్టేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. సెక్రటేరియెట్ నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ గురువారం పరిశీలించారు. అక్కడ అంతటా కలియతిరిగి అధికారులు, వర్క్ ఏజెన్సీ ఇంజనీర్లకు పలు సూచనలు చేశారు.

సెక్యూరిటీ సిబ్బంది ఆఫీసులు, రికార్డులను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్స్, అతిథుల కోసం నిర్మించిన కాన్ఫరెన్స్ హాల్స్, ఎంట్రీ గేట్లు, కాంపౌండ్ వాల్స్, వాటర్ ఫౌంటెయిన్లు, లాన్​లు, కారిడార్లు, చాంబర్లు, క్యాంటీన్లు పరిశీలించారు. అక్కడక్కడా చేయాల్సిన మార్పులపై కొన్ని సూచనలు చేశారు. హెలిప్యాడ్ కోసం స్థలాన్ని పరిశీలించి, అనువైన చోట నిర్మించాలని చెప్పారు. సిబ్బందికి, విజిటర్స్​కు ఇబ్బందుల్లేకుండా అన్ని చోట్ల లిఫ్టులు ఏర్పాటు చేయడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. పార్లమెంట్ తరహాలో చేస్తున్న టెర్రకోట వాల్ క్లాడింగ్ ను పరిశీలించారు. గత వంద ఏండ్లలో దేశంలో ఇంతపెద్ద మొత్తంలో దోల్ పూర్ స్టోన్ ను వినియోగించి కడుతున్న భవనం ఇదేనని ఈ సందర్భంగా కేసీఆర్ పేర్కొన్నారు. కాగా, తుది మెరుగులు, ఇంటీరియర్, ఫర్నీచర్ తదితర పనులపై అధికారులు ప్రగతి భవన్ లో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సీఎంకు వివరించారు. 

అంబేద్కర్ స్ఫూర్తితో...  

రాష్ట్రం కోసం అసువులు బాసిన అమరుల త్యాగ ఫలితమే కొత్త సెక్రటేరియెట్ అని కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ఆత్మగౌరవాన్ని మరింత ఇనుమడింపజేసే విధంగా, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా సెక్రటేరియెట్ రూపుదిద్దుకుంటోందని చెప్పారు. ‘‘అమరుల త్యాగాలను నిత్యం స్మరించుకునే విధంగా సెక్రటేరియెట్ కు ఎదురుగా అమర వీరుల స్థూపం నిర్మాణమవుతోంది. అంబేద్కర్ పేరును సార్థకం చేసే విధంగా సెక్రటేరియట్ కు ఆయన పేరు పెట్టుకున్నాం. సెక్రటేరియెట్ పక్కనే నిర్మాణమవుతున్న అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం.. ప్రజాప్రతినిధులు, అధికారులకు ఎల్లప్పుడూ తమ బాధ్యతను గుర్తు చేస్తూ ఉంటుంది. అమరుల త్యాగాలు, అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తితో, బంగారు తెలంగాణ దిశగా సెక్రటేరియెట్​లో విధులు కొనసాగుతాయి” అని ఆశాభావం వ్యక్తం చేశారు