స్టూడెంట్స్ డ్రాపౌట్స్ పెరిగినయ్.. స్కూల్స్, కాలేజీల్లో సౌలత్​లు లేవు

స్టూడెంట్స్ డ్రాపౌట్స్ పెరిగినయ్..  స్కూల్స్, కాలేజీల్లో సౌలత్​లు లేవు

హైదరాబాద్, వెలుగు:  సీఎం కేసీఆర్ పాలనలో స్టూడెంట్స్ డ్రాపౌట్స్ పెరిగాయని ఎన్ఎస్​యూఐ స్టేట్ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్ అన్నారు. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో మౌలిక సదుపాయాలు కరువయ్యాయన్నారు. మంగళవారం ఆయన గాంధీభవన్​లో మీడియాతో మాట్లాడారు. కేజీ టు పీజీ అని సీఎం కేసీఆర్ మోసం చేశారన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్​ లేక, ఫీజులు కట్టలేక చాలా మంది స్టూడెంట్స్ చదువుకు దూరం అవుతున్నారని తెలిపారు. గిరిజన, స్పోర్ట్స్ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తామని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. ప్రైవేట్ యూనివర్సిటీలకు మాత్రం అనుమతులు ఇస్తున్నారని ఆరోపించారు.

ఏ రాష్ట్రంలోనైనా బడ్జెట్​లో 15 శాతం విద్యా వ్యవస్థకు కేటాయిస్తారని, ఇక్కడ మాత్రం అలాంటి పరిస్థితి లేదని విమర్శించారు. కేసీఆర్ పాలనలో విద్యార్థులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. టీఎస్​పీఎస్సీపై పోరాటం చేసింది ఎన్ఎస్​యూఐ, యూత్ కాంగ్రెస్ మాత్రమే అని స్పష్టం చేశారు. టీఎస్​పీఎస్సీ తప్పులను సవరిస్తామని ఓ వైపు సర్కారు చెప్తూనే.. గ్రూప్ 1 రద్దును సుప్రీం కోర్టులో ఎత్తేయించేందుకు ప్రయత్నం చేస్తున్నదన్నారు. నిరుద్యోగుల పక్షాన ఎన్ఎస్​యూఐ పోరాటం మాత్రమే చేసిందని, నిరుద్యోగులే కోర్టులో పిటిషన్లు వేశారని స్పష్టం చేశారు.