కాగజ్ నగర్ జ్యోతి బాఫూలే రెసిడెన్షియల్ స్కూల్లో స్టూడెంట్ కు వేధింపులు!

కాగజ్ నగర్ జ్యోతి బాఫూలే రెసిడెన్షియల్ స్కూల్లో స్టూడెంట్ కు వేధింపులు!
  • తమ కొడుకును తోటి విద్యార్థులు వేధిస్తున్నారని పేరెంట్స్ ఆందోళన 
  • వాటర్ బాటిల్​లో మూత్రం పోస్తున్నారని, బాత్రూంకు వెళ్తే రాళ్లు వేస్తున్నట్లు ఆరోపణ

కాగజ్‌నగర్‌, వెలుగు: కాగజ్ నగర్ పట్టణం లోని చెక్ పోస్ట్ సమీపంలో ఉన్న మహాత్మ జ్యోతి బాఫూలే రెసిడెన్షియల్ స్కూల్​లో ఏడో తరగతి చదువుతున్న తమ కొడుకును తోటి స్టూడెంట్స్ వేధిస్తున్నారని పేరెంట్స్ ఆందోళనకు దిగారు. కాగజ్ నగర్ పట్టణం బాలాజీ నగర్​కు చెందిన బాలుడిని 15 రోజుల క్రితం జ్యోతి బాఫూలే హాస్టల్​లో ఏడో తరగతిలో చేర్చారు. అప్పటి నుంచి తమ కొడుకును తోటి విద్యార్థులు టార్గెట్ చేసి వేధిస్తున్నారని తల్లిదండ్రులు వాపోయారు. 

శనివారం స్టూడెంట్స్ ఔటింగ్​కు వెళ్లి  తల్లికి విషయం చెప్పి ఏడ్చాడు. బాలుడి నీళ్ల బ్యాటిల్​లో మూత్రం పోశారని, అది తెలియక మంచినీళ్లు అనుకొని తాగడంతో ఇన్​ఫెక్షన్ అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాత్ రూమ్​కు వెళ్లిన సమయంలో రాళ్లు విసరడంతో తృటిలో తప్పించుకున్నాడని పేర్కొన్నారు. రూములో పడుకునేందుకు తోటి విద్యార్థులు ఇబ్బందులు పెట్టడంతో వరండాలో పడుకున్నట్లు కొడుకు చెప్పాడని తల్లి వాపోయింది. ఈ విషయమై ప్రిన్సిపాల్ జయశ్రీని సంప్రదించగా సదరు స్టూడెంట్​కు చదువుపై ఇంట్రెస్ట్ లేకపోవడంతో ఏదో ఒక సమస్య చెబుతున్నాడని, కౌన్సెలింగ్ ఇచ్చినా మారడం లేదన్నారు.