అయ్యప్ప మాల ధరించిన విద్యార్థినిపై స్కూల్ సిబ్బంది అమానుషం

అయ్యప్ప మాల ధరించిన విద్యార్థినిపై స్కూల్ సిబ్బంది అమానుషం
  • క్లాస్​లోకి వెళ్లనివ్వకుండా బయట నిలబెట్టిన వైనం 
  • మేనేజ్​మెంట్​ తీరుపై మండిపడ్డ బాలిక తండ్రి 
  • బండ్లగూడలోని బిర్లా మైండ్‌ఓపెన్‌ స్కూల్‌లో ఘటన

గండిపేట, వెలుగు :  అయ్యప్ప మాల ధరించిన విద్యార్థినితో స్కూల్ సిబ్బంది అమానుషంగా ప్రవర్తించిన ఘటన బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్‌ పరిధిలోని బిర్లా మైండ్‌ ఓపెన్‌ స్కూల్‌లో సోమవారం జరిగింది. బాలిక కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదర్​షా కోట్​కు చెందిన వెంకటరామిరెడ్డి కూతురు పూర్వా రెడ్డి 4వ తరగతి చదువుతోంది. అయ్యప్ప మాల ధరించిన ఆ చిన్నారి సోమవారం స్కూల్​కు వెళ్లింది. దీంతో స్కూల్ సిబ్బంది  యూనిఫామ్‌తోనే రావాలని క్లాస్ రూమ్​లోకి నో ఎంట్రీ అంటూ ఆరు బయటనే నిల్చొబెట్టారు.

గంట తర్వాత బాలికతో ఆమె తండ్రికి ఫోన్‌ చేయించారు. అక్కడికి వచ్చిన బాలిక తండ్రి స్కూల్ సిబ్బంది వ్యవహరించిన తీరుపై మండిపడ్డారు.  ‘అయ్యప్ప మాల వేసుకోవడంలో తప్పేముంది’  అని ఆయన నిలదీశారు. తన కూతురు సర్టిఫికెట్లు, కట్టిన ఫీజు తిరిగి ఇవ్వాలన్నారు.  తమ మనోభావాలు దెబ్బ తీసేలా ప్రవర్తించిన స్కూల్ మేనేజ్​మెంట్​పై  చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. స్టూడెంట్లకు మంచి బుద్ధులు, కులమతాలకు అతీతంగా చదువు నేర్పించాల్సిన స్కూల్​ టీచర్లే ఇలా వ్యవహరిస్తే ఎలా అని వెంకటరామిరెడ్డి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.