
మీ ఇంట్లో బడికెళ్లే పిల్లలున్నారా..! మీవాడు కాస్త అటుఇటుగా తడబడుతున్నాడా..! అయితే, మీరు కాస్త జాగ్రత్తగా వుండాల్సిందే. ఈ కథనంలోలా మీవాడు బంగారు ఎత్తుకెళతాడు అని కాదండోయ్.. ఓ రెండేళ్ల తరువాత ఓ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి.. 'ఈ అమ్మాయి మీ కోడలు..' అని ఎక్కడ చెప్తాడేమో అన్న సందేహం. అసలే ఈ కాలం పిల్లలకు టీచర్లు చెప్పే పాఠాలు కంటే, అమ్మాయిల మనసులు, ప్రేమ పాఠాలు బాగా బుర్రకెక్కుతున్నాయి. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ.. ఈ కథనంలో విద్యార్థి.
సదరు విద్యార్థిది ఎంత గాఢమైన ప్రేమ కాకపోతే, అమ్మ బంగారం అమ్మి లవర్‌కు ఐఫోన్ కొనిస్తాడు చెప్పండి. ఓ తొమ్మిదో తరగతి విద్యార్థి ప్రియురాలికి ఆపిల్ ఐఫోన్ కొనివ్వడానికి, ఆమె బర్త్ డే పార్టీకి నిధులు సమకూర్చడానికి తల్లి బంగారాన్ని దొంగిలించి విక్రయించాడు. తద్వారా వచ్చిన డబ్బులతో లవర్‌కు 50వేల రూపాయల విలువైన ఐఫోన్ కొన్నాడు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. విద్యార్థి తెచ్చిన బంగారాన్ని కొన్నందుకు వ్యాపారులు ఊచలు లెక్కపెడుతున్నారు. ఈ ఘటన ఢిల్లీలోని నజాఫ్‌గఢ్ లో చోటుచేసుకుంది.
నజాఫ్‌గఢ్ ప్రాంతంలో తల్లితో కలిసి నివసిస్తోన్న ఓ 9వ తరగతి విద్యార్థి.. అదే క్లాస్ చదువుతోన్న తన ప్రియురాలికి ఐఫోన్ బహుమతిగా ఇద్దామని, తన ఇంట్లోనే అమ్మ బంగారాన్ని దొంగతనం చేశాడు. రెండు చైన్లు, ఒక జత చెవిపోగులు, ఒక బంగారు ఉంగరాన్ని లేపేసాడు. ఆ బంగారాన్ని అమ్మగా వచ్చిన డబ్బుతో రూ. 50 వేలు పెట్టి ప్రియురాలికి ఐఫోన్ కొన్నాడు. ఇంట్లో బంగారం కనిపించకపోవడంతో దొంగతనం జరిగిందంటూ బాలుడి తల్లి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది
ఫిర్యాదు నమోదు చేసి విచారణ ప్రారంభించిన పోలీసులకు ఇంట్లోకి బయట వ్యక్తులు వచ్చిన ఆనవాళ్లు కనిపించలేదు. దాంతో, 9వ తరగతి చదువుతోన్న ఆమె కొడుకును ప్రశ్నించగా చేసిన తప్పును ఒప్పుకున్నాడు. విచారణలో భాగంగా పోలీసులు మొదట సదరు బాలుడి పాఠశాల స్నేహితులను ప్రశ్నించారు. నిందితుడు రూ.50 వేల విలువైన కొత్త ఐఫోన్ కొన్నాడని వారు పోలీసులకు తెలిపారు. ఈ ఘటనలో ఆ బాలుడు తెచ్చిన బంగారాన్ని బంగారాన్ని కొన్నందుకు వ్యాపారులను పోలీసులు అరెస్ట్ చేశారు.
సదరు బాలుడు తన క్లాస్ మేట్ అయిన ఒక విద్యార్థినితో లవ్ లో ఉన్నాడని, ఆమెకు ఐఫోన్ కొనివ్వడం కోసమే ఇంట్లో బంగారం దొంగిలించినట్లు విచారణలో వెల్లడైందని డీసీపీ తెలిపారు.
వద్దని వారించిన తల్లి
ఈ వ్యవహారంలో మరో విషయమూ బయటకొచ్చింది. దొంగతనం చేయడానికి ముందు సదరు విద్యార్థి తల్లిని డబ్బులు అడిగినట్లు విచారణలో తేలింది. ఇంటి ఆర్థిక పరిస్థితి వివరించిన ఆ తల్లి, డబ్బు ఇవ్వడానికి నిరాకరించింది. ముందు, చదువుపై దృష్టి పెట్టమని సలహా ఇచ్చింది. ఆ సమయంలో విద్యార్థి తల్లితో వారించినట్లు పోలీసులు తెలిపారు.