
- రాజ్ భవన్ ముట్టడికి విద్యార్థి, యువజన సంఘాల యత్నం
హైదరాబాద్,వెలుగు : బీజేపీ పాలిత రాష్ర్టాల్లో జరుగుతున్న పేపర్ లీకులపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించాలని విద్యార్థి, యువజన సంఘాలు డిమాండ్ చేశాయి. నీట్ పేపర్ ను మళ్లీ నిర్వహించాలని, పేపర్ లీకేజీ నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ సోమవారం విద్యార్థి, యువజన సంఘాలు (ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యూఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యూ, వీజేఎస్, డీవైఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీవైఎస్, యువజన కాంగ్రెస్) రాజ్ భవన్ ముట్టడికి ప్రయత్నించాయి. ర్యాలీగా వస్తున్న ఆయా సంఘాల నేతలను నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో పోలీసులకు, విద్యార్థి, యువజన నేతలకు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో కొందరు పోలీసులు విద్యార్థి నేతలపై చేయిచేసుకున్నారు. బలవంతంగా వారందరినీ పోలీసులు అరెస్టు చేసి గోషామహల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ, ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠ రెడ్డి, పీడీఎస్యూ రాష్ట్ర నేతలు పెద్దింటి రామకృష్ణ, మహేశ్, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేష్, వెంకటేశ్, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ధర్మేంద్ర
పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్ ప్రదీప్, వైజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సలీంపాషా మాట్లాడుతూ... దేశంలో క్వశ్చన పేపర్ల లీకేజీలు సాధారణమయ్యాయని ఆరోపించారు. పేపర్ లీకేజీల్లో బీజేపీ నేతలు కారణమనే అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు. నీట్ పేపర్ లీకేజీకి ఎన్టీఏ డైరెక్టర్ ను తొలగించాలని డిమాండ్ చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నీట్ పరీక్షపై నిర్లక్ష్యపూరిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. నీట్ పై సీబీఐ విచారణ సరిగా లేదని, వెంటనే సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ చేయించాలని కోరారు.