తాలిపేరు నిర్వహణ గాలికి.. వానాకాలం నాటికి నిర్వహణ పనులు పూర్తయితేనే రైతులకు మేలు

తాలిపేరు నిర్వహణ గాలికి.. వానాకాలం నాటికి  నిర్వహణ పనులు పూర్తయితేనే రైతులకు మేలు
  • ఏప్రిల్​లోనే పూర్తి చేసి ట్రయల్​ రన్​ నిర్వహించాలి
  • ఏవైనా లోపాలు ఉంటే మేలో సరిదిద్దాలి 
  • కానీ ఇప్పటికీ పనులు మొదలు కాలే.. 
  • కాల్వల రిపేర్లలోనూ అదే నిర్లక్ష్యం!

భద్రాచలం, వెలుగు : చర్ల మండలంలోని తాలిపేరు పనుల నిర్వహణపై నిర్లక్ష్యపు నీడలు అలుముకున్నాయి. వానాకాలం దగ్గర పడుతున్నా నేటికీ పనులు చేపట్టాలనే ఆలోచనలో ఇంజినీర్లు లేనట్లు కనిపిస్తోంది.  నిర్వహణ పనులు ఏటా ఏప్రిల్​లో పూర్తి చేసి ట్రయల్​ రన్​ నిర్వహించి మేలో లోపాలు సరిదిద్దుకుంటే ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. కానీ ఈసారి ఆ దిశగా పనులు కొనసాగడం లేదు. 

ప్రాజెక్టులో గ్రీజింగ్​తో పాటు కార్డియన్​ కాంపౌండ్​, రోప్​ ఆయిలింగ్, గేట్ల లీకేజీ అరికట్టే చర్యలు, విద్యుదీకరణ పనులు, మెకానికల్​ నిర్వహణ చేయాల్సి ఉంది. హయ్యెస్ట్ వంతెనపై చేపట్టాల్సిన మెకానికల్​ పనులతో పాటు మోటార్ల రిపేర్లు చేపట్టాలి. గ్యాలరీలో లీకేజీ నీటిని పంపింగ్​ చేసే మోటార్ల పనితీరును పరిశీలించాల్సి ఉంటుంది. అత్యవసర పనులను నెల రోజుల వ్యవధిలోనే పూర్తి చేయాలి. విద్యుత్ సరఫరాలో లోపాలు తలెత్తకుండా సంబంధిత పనులను చేయాలి. కానీ ఇప్పటికీ ఇవేవీ లేవు.

కాల్వల పనుల్లోనూ అంతే

ప్రధాన ఎడమ, కుడి కాల్వల్లో స్ట్రక్చర్ల నిర్మాణం, రిపేర్ల పనుల్లో ఇప్పటికీ ఇంజినీర్లు జాప్యం చేస్తున్నారు. కాల్వల రిపేర్ల కోసం దాదాపు రూ.4కోట్ల మేర నిధులు రిలీజ్​ అయ్యాయి. యాసంగి సాగుకు నీటిని రిలీజ్​ చేయడంతో పనుల ప్రారంభానికి ఆటంకం ఏర్పడింది. కాల్వలకు ప్రస్తుతం నీటి విడుదల నిలిపేశారు. కానీ కాల్వ పనుల్లో ఎడతెగని జాప్యం కొనసాగుతోంది.  గతేడాది వర్షాల తర్వాత ఊహించకుండా ప్రాజెక్టులో 14వ గేటు దిగకుండా స్టక్​ అయ్యింది. దీంతో యాసంగిలో ఈ గేటు నుంచి ఎక్కువ నీరు లీకైంది. ఈ గేటు రిపేరు చేసినా ఫలితం లేకుండా పోయింది. రిజర్వాయర్​లో బెల్​ లెవల్​ (69 మీటర్లు)వరకు నీటినంతటినీ దిగువకు పంపించి ప్రాజెక్టులోని 25 గేట్లు పూర్తి స్థాయిలో ఎత్తితే నిర్వహణ పనులు చేసే వీలుంటుంది. లేకపోతే ఈసారి వర్షాకాలంలో ఇబ్బంది తప్పదు. 

ఇంకెప్పుడు చేస్తరు? 

వానాకాలం సమీపిస్తోంది. ఇంకెప్పుడు పనులు మొదలు పెడతారు? ప్రాజెక్టుకు రంగులు వేసేందుకు రూ.1.60కోట్లు వచ్చినాయి. ఏడాది కాలంగా మొదలు కాలే. ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించి పనులు వెంటనే మొదలు పెట్టేలా ఆదేశాలు ఇవ్వాలి.

ఇందల గోపాలబుచ్చిబాబు, రైతు కమిటీ చైర్మన్, ఆర్.కొత్తగూడెం