పహల్గాం ఘటనకు 15 రోజుల్లోనే సమాధానమిచ్చాం : బండి సంజయ్ కుమార్

పహల్గాం ఘటనకు 15 రోజుల్లోనే సమాధానమిచ్చాం : బండి  సంజయ్ కుమార్
  • కరీంనగర్‌‌‌‌‌‌‌‌లో వర్షంలోనే సాగిన హిందూ ఏక్తా యాత్ర

కరీంనగర్, వెలుగు: అమెరికాలోని ట్విన్ టవర్స్‌‌‌‌పై అల్ ఖైదా దాడి చేసి 6 వేల మందిని చంపితే...  ఆ దేశం10 ఏళ్ల తర్వాత ఒసామా బిన్ లాడెన్ ను పట్టుకుని చంపిందని,  కానీ పహల్గాం ఘటన జరిగిన 15 రోజుల్లోనే భారత సైన్యం ఉగ్రవాదుల అంతు చూసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి  సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్‌‌‌‌పై చిన్నపాటి యుద్దమే జరిగిందంటూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే భారత సైన్య  పోరాటాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని, . పాకిస్తాన్ లోపలకు వెళ్లి 9 ఉగ్రవాద స్థావరాలను, పాక్ ఆర్మీకి చెందిన 11 మిలటరీ బేస్ ను ధ్వంసం చేయడం చిన్న యుద్ధమా? అని సంజయ్ ప్రశ్నించారు. 

కరీంనగర్‌‌‌‌‌‌‌‌లో గురువారం సాయంత్రం నిర్వహించిన హిందూ ఏక్తా యాత్రలో బండి సంజయ్ మాట్లాడుతూ రాఫెల్ విమానాలు, భారత సైన్యం పోరాటాలపై రాహుల్ గాంధీ చులకనగా మాట్లాడుతున్నారని, అందుకే ఆయనకు మన దేశంలో కన్నా పాకిస్తాన్ లోనే ఎక్కువ మంది అభిమానులున్నారని ఎద్దేవా చేశారు.  గతంలో ఇదే హిందూ ఏక్తా యాత్ర చేస్తుంటే తనకు గుండెపోటు వచ్చిందని, పూర్తి స్పృహ కోల్పోయే ముందు తనకు మళ్లీ ఆయుష్షు ఇవ్వాలని అమ్మవారిని వేడుకున్నానని గుర్తు చేశారు. అమ్మవారు కరుణించి మళ్లీ తనకు పునర్జన్మనిచ్చిందని అందుకే తన బోనస్ జీవితమంతా కాషాయ జెండా, సనాతన ధర్మం కోసమేనని స్పష్టం చేశారు. 

రోహింగ్యాలను, విదేశీయుల్ని బయటకు పంపే దమ్ముందా?. 

'ట్రంప్ కు భయపడి మోదీ యుద్ధం ఆపేసిండని రేవంత్ రెడ్డి చెప్పడం సిగ్గుచేటు. కాంగ్రెస్ హయాంలో యుద్ధం జరిగితే పాకిస్తాన్‌‌‌‌ను రెండు ముక్కలు చేసినప్పుడు పీవోకేను ఎందుకు స్వాధీనం చేసుకోలేదో సమాధానం చెప్పాలి. మన దేశంలో అక్రమంగా నివాసముంటున్న విదేశీయుల్ని దేశమంతటా ఏరివేస్తుంటే మీరెందుకు సైలెంట్ గా ఉన్నరు?.వాళ్లకు రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు అందించి సబ్సిడీలు ఇచ్చింది నిజం కాదా?..

మీకు నిజంగా దేశభక్తి ఉంటే అక్రమంగా ఉంటున్న రోహింగ్యాలను, విదేశీయుల్ని బయటకు పంపే దమ్ముందా?.. లేనిపక్షంలో వాళ్లను పంపివ్వబోం, రేషన్ కార్డులిస్తాం అని కేంద్రానికి లేఖ రాస్తారా?.. వాళ్లను ఎట్లా పంపించాలో, ఎలాంటి చర్యలు తీసుకోవాలో కేంద్రం చూసుకుంటుంది.’ అని సంజయ్ సవాల్ విసిరారు. ర్యాలీలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, సామాజిక సమరసత కన్వీనర్ ప్రసాద్, హంపి పీఠాధిపతి శ్రీవిద్యారణ్య భారతి పాల్గొన్నారు. 

వర్షంలోనే ర్యాలీ 

కరీంనగర్‌‌‌‌‌‌‌‌లో హిందూ ఏక్తా ర్యాలీ ప్రారంభానికి ముందే సాయంత్రం నుంచి వర్షపు జల్లులు కురిశాయి. వానలోనే వైశ్య భవన్ నుంచి టవర్ సర్కిల్ మీదుగా బస్టాండ్ వరకు ర్యాలీ కొనసాగింది. ర్యాలీలో సిటీలోని యువత, బీజేపీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. దీంతో సిటీ అంతా కాషామయమైంది. 

కరీంనగర్ క్రైం,వెలుగు : హనుమాన్ జయంతి సందర్భంగా  సిటీలో నిర్వహించిన హిందూ ఏక్తాయాత్ర  బందోబస్తును కరీంనగర్ సీపీ గౌస్‌‌‌‌ ఆలం పర్యవేక్షించారు. భద్రతా చర్యల్లో భాగంగా పోలీసు కమాండ్ కంట్రోల్ బస్సులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పని తీరును పరిశీలించారు. 400 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. బందోబస్తులో ఏసీపీ వెంకటస్వామి , సీఐలు బిల్లా కోటేశ్వర్, సృజన్ రెడ్డి, కరీముల్లా ఖాన్ ఇతర అధికారులు పాల్గొన్నారు.