టైగర్ హంట్ లో 38 మంది నిందితులు .. సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఫారెస్ట్ ఆఫీసర్లు

టైగర్ హంట్ లో 38 మంది నిందితులు .. సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఫారెస్ట్ ఆఫీసర్లు
  • వారం రోజుల దర్యాప్తులో వెలుగులోకి కీలక అంశాలు
  • నిందితులకు కఠిన శిక్ష పడేలా ప్రణాళిక
  • రిమాండ్ రిపోర్ట్ రెడీ చేస్తున్న అధికారులు

ఆసిఫాబాద్/కాగజ్ నగర్, వెలుగు: వేటగాళ్ల విద్యుత్ వైర్లకి పులి బలైన ఘటనలో ఫారెస్ట్ ఆఫీసర్ల విచారణ ఫైనల్ స్టేజ్​కు చేరుకున్నట్లు తెలుస్తోంది. నిందితులు పక్కా ప్రణాళికతో ఈనెల 15న కాగజ్ నగర్ డివిజన్ లోని పెంచికల్​పేట్ రేంజ్ ఎల్లూరు సెక్షన్ నల్లకుంట వద్ద పులికి కరెంట్ పెట్టి చంపి, దాని అవయవాలను కోసి తీసుకెళ్లి పాతి పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో మొదట సుమారు డజను మంది అనుమానితులను అధికారులకు అదుపులోకి తీసుకుని విచారణ మొదలు పెట్టగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

 ఏ ఒక్కరిని వదలకుండా అధికారులు తమదైన శైలిలో ఇన్వెస్టిగేషన్ చేస్తుండడంతో నిజాలు బయటపడుతూ నిందితుల సంఖ్య పెరుగుతోంది. పులి హతమార్చిన కేసులో ఏకంగా 38 మంది ఉన్నట్లు సమాచారం. ప్రధాన నిందితులతో పాటు వారికి సహకరించిన వారిని కేసులో ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఈ కేసులో మొత్తం 38 మంది అయినట్లు పొక్కడం జిల్లాలో హాట్ టాపిక్​గా మారింది. 

వేటగాళ్లు తప్పించుకోకుండా సమగ్ర రిపోర్ట్

వేటగాళ్లు పక్కా ప్రణాళికతో పులిని హతమార్చగా.. అటవీ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని విమర్శలు వస్తున్నాయి. గతంలో అటవీ అభివృద్ధికి, పులి రక్షణ కోసం చేపట్టిన పనులను, చర్యలను వేలెత్తి చూపుతున్నారు. దీంతో ఈ ఘటనను సీరియస్​గా తీసుకున్న అధికారులు వేటగాళ్ల పట్ల భిన్నమైన వైఖరి అవలంబిస్తున్నారు. వేటగాళ్లు మరోసారి ఇలాంటి ఘటనలకు పాల్పడకుండా వారికి కఠిన శిక్ష పడేలా అటవీ చట్టాలను లోతుగా అధ్యయనం చేస్తూ పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

 గతేడాది పులికి విషాహారం పెట్టి చంపిన ఘటనలో నిందితులకు కొన్ని రోజుల్లోనే బెయిల్ మంజూరు కావడంతో నేరం చేసిన వాళ్లకు భయం లేకుండా పోయిందని, కోర్టు ముందు బలమైన వాదనలు ఉండేలా ఈసారి బలమైన రిపోర్ట్ తయారు చేస్తున్నట్లు సమాచారం. నేడో, రేపో నిందితులను కోర్టులో రిమాండ్ చేసేందుకు పత్రాలు రెడీ చేస్తున్న అధికారులు.. పులి హత్య (వేట), దాని పర్యావసానం, అడవీ ప్రాంతానికి జరుగుతున్న నష్టంపై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. ఫలితంగా నిందితులకు కఠిన శిక్ష పడి వారు ఎక్కువ కాలం జైలుకు వెళ్లే అవకాశం ఉంది.

పీడీ యాక్ట్ ప్రయోగంపై సమాలోచనలు

పులి హత్య ఘటనలో నిందితుల హిస్టరీ గురించి అధికారులు లోతైన సమాచారం సేకరిస్తున్నారు. బెల్లంపల్లి కేంద్రంగా జరుగుతున్న ఇన్వెస్టిగేషన్​లో ప్రత్యేక బృందం  నిందితులను క్రాస్ చెక్ చేస్తున్నారు. గ్రూపుగా, విడివిడిగా విచారిస్తున్నారు. వారు గతంలో చేసిన నేరాలు, వాటి వివరాలు నమోదు చేస్తున్నట్లు సమాచారం.  పులి హతమార్చినవారంతా పెంచికల్​పేట్ మండలం ఎల్లూరు, కోయ చిచ్చాల, అగర్​గూడ, దహెగాం మండలం చిన్న రాస్పల్లితో పాటు మరికొన్ని గ్రామాల వారు ఉన్నారని, వీరంతా పాత నేరస్తులేనని గుర్తించారు. 

వీరంతా కొన్నేళ్లుగా వన్య ప్రాణులు వేటాడుతున్నట్లు తేల్చారు. వీరిపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధించినా వారిలో మార్పు రాకపోవడంతో పీడీ యాక్ట్ సరైందని అధికారులు భావిస్తున్నారు. పులి అవయవాలు రికవరీ చేసిన సమయంలో నిర్వహించిన ప్రెస్ మీట్​లో కవ్వాల్ ఫీల్డ్ డైరెక్టర్ శాంతారాం, డీఎఫ్​వో నీరజ్ కుమార్ మాట్లాడుతూ నిందితుల మీద పీడీ యాక్ట్ అమలు చేసేలా చూస్తున్నామని చెప్పారు. పక్కా ఆధారాలతోపాటు వేటగాళ్ల కారణంగా అడవికి, పర్యావరణానికి, జంతుజాలానికి పొంచి ఉన్న ముప్పు గురించి కోర్టు ముందు వినిపించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.