టీచర్స్​ లేరు.. ఫెసిలిటీస్​ లేవు..ఆన్​లైన్​ క్లాసులే గతి..!

టీచర్స్​ లేరు.. ఫెసిలిటీస్​ లేవు..ఆన్​లైన్​ క్లాసులే గతి..!

కొత్తగూడెం నర్సింగ్​ స్టూడెంట్ల దుస్థితి
విద్యార్థులకు ఆన్​లైన్​లోనే క్లాసులు
జాడలేని ఫ్యాకల్టీ, నాన్ టీచింగ్ స్టాఫ్​ 
నర్సింగ్ కాలేజీకి అద్దె భవనమే దిక్కు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ‘జిల్లాకు నర్సింగ్, మెడికల్​కాలేజీ రెండూ వచ్చాయి. ఇక మన్యం జిల్లాకు మహర్దశ పట్టనుంది. కాలేజీల భవనాల నిర్మాణాలకు ఫండ్స్​ రిలీజ్ చేస్తున్నాం’.. అంటూ రెండేళ్ల కింద మంత్రులు హరీశ్​రావు, పువ్వాడ అజయ్​కుమార్​ గొప్పగా చెప్పారు. అయితే ఇక్కడ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. మొదట నర్సింగ్​కాలేజీ​ కోసం కట్టిన భవనాన్ని ఉన్నతాధికారులు మెడికల్​కాలేజీకి కేటాయించారు. దీంతో నర్సింగ్ కాలేజీకి ఓ భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. దీనిలో సౌకర్యాలు లేక అడ్మిషన్​తీసుకున్న విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు బోధన, బోధనేతర సిబ్బంది కూడా లేరు. దీంతో ప్రత్యక్ష తరగతులకు కొనసాగడంలేదు. ఆన్ లైన్ క్లాస్ లతోనే విద్యార్థులు కాలం వెళ్లదీస్తున్నారు. దీంతో స్టూడెంట్స్ తోపాటు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 

మెడికల్​కాలేజీ భవనం పూర్తయ్యే వరకు..

నర్సింగ్​కాలేజీ కోసం పాల్వంచలోని మైనింగ్ కాలేజీ ఆవరణలో భవన నిర్మాణాన్ని 2021లో ప్రారంభించారు. బిల్డింగ్​పూర్తయ్యే దశలో ఉండగానే దాన్ని ఉన్నతాధికారులు మెడికల్​కాలేజీకి కేటాయించారు. ‘మొదట మెడికల్​కాలేజీకి పర్మిషన్​ రావాలంటే బిల్డింగ్ కావాలి. నర్సింగ్​కాలేజీ సంగతి తర్వాత చూద్దాం’.. అంటూ పూర్తి అయిన భవనాన్ని మెడికల్​కాలేజీకి అప్పగించారు. దీన్ని గతేడాది సీఎం కేసీఆర్ వర్చువల్ గా ప్రారంభించారు. మెడికల్ కాలేజీ బిల్డింగ్​నిర్మాణం పూర్తయ్యేంత వరకు నర్సింగ్ కాలేజీ భవనాన్ని వాడుకోనున్నారు.

రెండు నెలలు పూర్తయినా...

నర్సింగ్​కాలేజీకి అడ్మిషన్లు చేపట్టాలని ప్రభుత్వం గతేడాది ప్రిన్సిపాల్, వైస్​ప్రిన్సిపాల్​ను పంపించింది. పక్కా భవనం లేక కొత్తగూడెంలోని రామా టాకీస్​రోడ్ లో ఉన్న ఓ బిల్డింగ్​ను అద్దెకు తీసుకున్నారు. యజమానితో తాత్కాలిక ఒప్పందం చేసుకున్నారు. ప్రభుత్వం నుంచి రెంట్​డిసైడ్ అయితే అగ్రిమెంట్​ప్రకారం టాయ్​లెట్స్, సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధమని బిల్డింగ్ యజమాని అన్నట్టు తెలిసింది. ఈ క్రమంలో అడ్మిషన్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. 2022 డిసెంబర్ చివరి నాటికి 60 అడ్మిషన్లు పూర్తయ్యాయి. ఇది జరిగి రెండు నెలలు గడుస్తున్నా పూర్తిస్థాయిలో ఫ్యాకల్టీ రాలేదు. దీంతో స్టూడెంట్స్​కొంత ఆందోళన చెందుతున్నారు. డిప్యూటేషన్ పై కొందరిని కేటాయిస్తామని ఉన్నతాధికారులు తెలిపారు. కాలేజీలో నాన్ టీచింగ్​స్టాఫ్​లో కేవలం ఏవో ఒక్కరే ఉన్నారు. మిగిలిన స్టాఫ్​ లేరు. కాలేజీకి అవసరమైన ఫర్నిచర్ ​సహ ఇతర మౌళిక వసతులు లేవు. దీంతో ఆన్​లైన్​క్లాసెస్​తో కాలం వెళ్లదీసే పరిస్థితి ఏర్పడింది. కనీసం కాలేజీ బోర్డు కూడా లేదు.

త్వరలో ప్రత్యక్ష తరగతులు..

త్వరలో ప్రత్యక్ష తరగతులు ప్రారంభిస్తాం. బెడ్స్, ఫర్నిచర్ పూర్తి స్థాయిలో రాక ఆన్​లైన్​ ద్వారా క్లాసెస్​నడిపిస్తున్నాం. ఉన్నతాధికారులకు లెటర్​పెట్టాం. డిప్యూటేషన్​పై ఫ్యాకల్టీని పంపుతున్నారు. అద్దె బిల్డింగ్ లో మరిన్ని సౌకర్యాలు కల్పించాలని యజమానికి సూచించాం. 

–జ్యోతి, నర్సింగ్​కాలేజీ ప్రిన్సిపాల్