గురుకుల ​స్కూల్​లో భోజనం సరిగా పెట్టడం లేదంటూ స్టూడెంట్స్​ ఆందోళన

గురుకుల ​స్కూల్​లో భోజనం సరిగా పెట్టడం లేదంటూ స్టూడెంట్స్​ ఆందోళన
  •     హనుమకొండ జిల్లాలో గురుకుల స్టూడెంట్స్​ ఆందోళన 
  •     మంచి భోజనం పెట్టడం లేదని పాఠశాల ముందు ధర్నా
  •     తినలేక ఖాళీ కడుపుతో పడుకుంటున్నామని ఆవేదన

గురుకుల ​స్కూల్​లో భోజనం సరిగా పెట్టడం లేదని హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కరుణాపురంలో స్టూడెంట్స్​ ఆందోళనకు దిగారు. ‘‘మేము తినే అన్నం బర్లు కూడా తినడంలేదు” అని స్కూల్​ ఆవరణలో బర్లకు పెడుతూ నిరసన తెలిపారు. ఖాళీ కడుపుతో పడుకుంటున్నామని ధర్నాకు దిగారు.

ధర్మసాగర్, వెలుగు: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కరుణాపురంలోని జ్యోతిబా ఫూలే బీసీ వెల్ఫేర్ ​స్కూల్​లో మంచి భోజనం పెట్టడం లేదని స్టూడెంట్స్​ఆందోళన చేపట్టారు. ‘‘మేము తినే అన్నం బర్లు కూడా తినడం లేదు” అని స్కూల్​ ఆవరణలో ఉన్న బర్లకు పెడుతూ నిరసన తెలిపారు.  గురువారం స్కూల్​ ముందు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ఉదయం నుంచి స్టూడెంట్స్​ధర్నా చేస్తున్నా అధికారులు పట్టించుకోలేదు. సంఘటనా స్థలానికి మీడియా చేరుకోగానే పాఠశాల యాజమాన్యం వచ్చి స్టూడెంట్స్​ను ధర్నా విరమించాలని కోరారు. అందుకు వారు ఒప్పుకోలేదు. తమకు న్యాయం కావాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా స్టూడెంట్స్​ మాట్లాడుతూ.. భోజనం మెనూ ఫాలో కావడం లేదని తెలిపారు. అన్నం ముద్దగా ఉంటుందని, జీరా రైస్ లో నీళ్లు ఉంటున్నాయని వాపోయారు.  తినలేక ఖాళీ కడుపుతో పడుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

మంచినీటి సౌకర్యం లేక ట్యాంక్ వాటర్ తాగుతున్నామన్నారు. స్కూల్​లో ఏ స్విచ్ బోర్డు పగిలినా తమ కాస్మోటిక్ బిల్లుల్లోనే కట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైనా పై అధికారులకు కంప్లైంట్ చేస్తే వాళ్లని టార్గెట్ చేసి కొడుతున్నారని చెప్పారు. ఫెసిలిటీస్​ గురించి ఎవరైనా ప్రశ్నిస్తే వారి తల్లిదండ్రులను పిలిచి బెదిరిస్తున్నారని అన్నారు. బాత్రూం పైపులు లీకై దుర్వాసన వస్తోందని, ఆ వాసనను భరించలేకపోతున్నామని తెలిపారు. పాఠశాల ముందుభాగం చెత్తాచెదారంతో నిండిపోయిందని..  పైఅధికారులకు చెప్పినా స్పందిస్తలేరని అన్నారు. ఈ సమస్యపై ప్రిన్సిపల్ మల్లయ్యను వివరణ కోరగా మెనూ ప్రకారం అన్నీ పెడుతున్నామని, ఈ రోజు వంటమనిషి రాకపోవడంతో ఇడ్లీకి బదులు జీరా రైస్ పెట్టామని, అది సరిగా లేదని స్టూడెంట్స్​ ధర్నాకు దిగారని అన్నారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ సిక్తా పట్నాయక్.. ధర్మసాగర్ తహసీల్దార్ రజినిని హాస్టల్​కు వెళ్లి విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.