దారి లేక బడికి వెళ్లలేకపోతున్న స్టూడెంట్లు

దారి లేక బడికి వెళ్లలేకపోతున్న స్టూడెంట్లు

నర్సింహులపేట, వెలుగు : మహబూబాబాద్ జిల్లాలోని నర్సింహులపేట మండలం బాసు తండా పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ కు దారి లేక స్టూడెంట్లు బడికి వెళ్లలేకపోతున్నారు. దీనికి నిరసనగా మంగళవారం రోడ్డుపై బైఠాయించారు. దీంతో టీచర్​అక్కడికే వచ్చి పాఠాలు చెప్పాడు. 2010లో తండాకు చెందిన ఒక దాత తన మూడు గుంటల వ్యవసాయ భూమిని స్కూల్ కోసం ఇచ్చాడు. అక్కడ బడి నిర్మించగా విద్యార్థులు కెనాల్ దారి వెంట వెళ్లేవారు. కొందరు ఆ కెనాల్ దారిని అక్రమించుకోవడంతో పొలం గట్లపై నుంచి వెళ్లడం స్టార్ట్​ చేశారు. 

ఈ మధ్య రైతులు వరి నాట్లు వేసి.. తమ గట్లపై నుంచి వెళ్లవద్దని హెచ్చరించారు. దీంతో రెండు రోజుల నుంచి 22 మంది స్టూడెంట్లు బడికి వెళ్లడం లేదు. ఈ క్రమంలో తమకు దారి కావాలని బుధవారం మెయిన్ ​రోడ్డుపై బైఠాయించారు. తల్లిదండ్రులు కూడా వారి వెంట వచ్చారు. ఇట్లయితే తమ పిల్లలు ఎట్లా చదువుకుంటారని..అధికారులు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. పిల్లలు స్కూల్ కు రాకపోవడంతో విషయం తెలుసుకున్న టీచర్ సుదర్శన్​ అక్కడికే వచ్చి పాఠాలు చెప్పారు. పోలీసులు వచ్చి స్టూడెంట్లు, వారి తల్లిదండ్రులతో మాట్లాడి సర్ది చెప్పి పంపించారు. ఇంత జరిగినా సంబంధిత ఆఫీసర్లు మాత్రం రాలేదు.