
- ఊడిన తలుపులు..
- రెక్కలు లేని కిటికీలు
- మూలకుపడ్డ గీజర్లు..
- దుప్పట్లు లేక బెడ్షీట్లే దిక్కు
(వెలుగు, నెట్వర్క్) రాష్ట్రంలో ఐదారు రోజులుగా చలి పెరగడంతో రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్లలోని పిల్లలు గజగజ వణికిపోతున్నరు. వింటర్‌కు ముందే దుప్పట్లు, కార్పెట్లు పంచాల్సిన ఆఫీసర్లు పట్టించుకోకపోవడంతో స్టూడెంట్లు తిప్పలు పడుతున్నరు. చాలా హాస్టళ్లలో తలుపులు విరిగిపోవడం, కిటికీల అద్దాలు పగిలిపోవడంతో చలిగాలి లోపలికి వచ్చి దడ పుట్టిస్తున్నది. ఉన్న బెడ్షీట్లను తలుపులు, కిటికీలకు అడ్డం కట్టుకుని.. అందరూ నేల మీదనే పండుకుంటున్నరు. కొన్నిచోట్ల ఇనుప మంచాలున్నా.. పరుపులు లేక చలికి వాటిపై పండుకోవాల్నంటే పిల్లలు బుగులు పడుతున్నరు. ఇంకొన్ని చోట్ల దుప్పట్లు ఇచ్చినా సన్నగా ఉండడంతో చలిని ఆపుతలేవు. మరికొన్ని హాస్టళ్లకు రగ్గుల స్టాక్ వచ్చినా స్టూడెంట్లకు పంచకుండా మూలకు పడేసిన్రు. దీంతో కింద పరుచుకోవాల్సిన బెడ్షీట్లనే పిల్లలు కప్పుకొని పడుకుంటున్నరు. చాలా స్కూళ్లలో సోలార్ హీటర్లు, గీజర్లు పని చేస్తలేవు. చిన్న చిన్న లోపాలున్న గీజర్లు, హీటర్లను కూడా రిపేర్ చేయించకపోవడంతో పొద్దున చన్నీళ్లతోటే పిల్లలు స్నానాలు చేస్తున్నరు.
అన్ని చోట్లా సమస్యలే
రాష్ట్రవ్యాప్తంగా 873 ఎస్సీ, 136 ఎస్టీ, 697 బీసీ హాస్టళ్లలో 1,46,618 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. 326 ఎస్టీ ఆశ్రమ స్కూళ్లలో 87,933 మంది స్టూడెంట్లు ఉంటున్నారు. ఇవికాకుండా 268 ఎస్సీ, 180 ఎస్టీ, 281 బీసీ, 192 మైనార్టీ గురుకులాల్లో 4.5 లక్షల మంది స్టూడెంట్లు రెసిడెన్షియల్ విధానంలో చదువుకుంటున్నారు. చాలావరకు హాస్టళ్లన్నీ పాడుబడిన బిల్డింగుల్లో కొనసాగుతున్నాయి. 665 గురుకులాలు కిరాయి బిల్డింగ్స్‌లో నడుస్తున్నాయి. సౌలతులు లేక ఇబ్బంది పడుతున్న స్టూడెంట్లకు ఇప్పుడు చలితో తిప్పలు మరింత పెరిగాయి. ఈ చలికాలంలో రాష్ట్రవ్యాప్తంగా టెంపరేచర్లు దారుణంగా పడిపోతున్నాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ములుగు లాంటి జిల్లాలోనైతే 5 కంటే తక్కువ, మిగిలిన జిల్లాల్లోనూ కనిష్టంగా 8 నుంచి10 డిగ్రీల వరకు టెంపరేచర్లు రికార్డు అవుతున్నాయి. దీంతో పెద్దలే చలిని తట్టుకోలేక రెండేసి బ్లాంకెట్లు కప్పుకుంటున్నారు. అలాంటిది రాష్ట్రవ్యాప్తంగా వివిధ రెసిడెన్షియల్ స్కూళ్లు, సర్కారు హాస్టళ్లలో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునేందుకు బుధవారం ‘వెలుగు’ ఫీల్డ్ విజిట్ చేయగా.. అక్కడ పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తేలింది.
ఏ జిల్లాలో చూసినా ఇదే తీరు
మహబూబ్‌నగర్ న్యూటౌన్‌లో ఉన్న బీసీ హాస్టల్ రూమ్స్‌కు డోర్లు లేవు. స్టూడెంట్లకు దుప్పట్లు ఇవ్వకపోవడంతో చలికి గజగజ వణుకుతున్నారు. ఇండ్ల నుంచి తెచ్చకున్న చెద్దర్లతో అడ్జెస్ట్ చేసుకుంటున్నారు. ఇద్దరు కలిపి ఒకే దుప్పటి కప్పుకొని పడుకుంటున్నారు. హాస్టల్‌లో గీజర్ఏర్పాటు చేయలేదు. దీంతో స్టూడెంట్లు ఉదయం ఆరున్నర నుంచే ఆరు బయట నల్లా దగ్గర బకెట్లలో చల్ల నీళ్లను పట్టుకొని స్నానం చేస్తున్నారు. నవాబ్‌పేట మండలం యన్మన్గండ్లలోని ఎస్సీ బాయ్స్ హాస్టల్ రూమ్స్ తలుపులు విరిగిపోయాయి. కొన్ని గదులకు తలుపులు ఉన్నా, చెక్కలు ఊడిపోయాయి. బిల్డింగ్ పాతది కావడంతో పెచ్చులు ఊడిపడుతున్నాయి. ఇక్కడా గీజర్ లేదు. మాగనూర్, పెద్దమందడి ఎస్సీ హాస్టళ్లలో ఆరుబయట, బోరు వద్ద స్టూడెంట్లు చలిలో స్నానాలు చేస్తున్నారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలుర హాస్టల్‌లో కొన్ని గదుల్లో వెంటి లేటర్ల నుంచి చల్ల గాలి వస్తుండడంతో అట్టలు అడ్డం పెట్టారు. గీజర్లు లేక స్టూడెంట్స్ బకెట్లో నీళ్లు తీసుకెళ్లి బిల్డింగ్‌పైన కొంత సేపు ఎండలో నీళ్లను పెట్టి స్నానం చేస్తున్నారు. హాస్టల్‌కు వచ్చిన దుప్పట్లు సన్నగా ఉండడంతో చలిని ఆపడం లేదు.
కరీంనగర్ జిల్లా వీణవంకలోని ఎస్సీ హాస్టల్ లో కిటికీలకు డోర్లు లేక పిల్లలు టవల్స్ కట్టుకుంటున్నారు. బోర్ నీళ్లతో స్నానాలు చేస్తున్నారు. చొప్పదండి హాస్టల్ లో పిల్లలు పడుకునే డార్మెటరీ రూమ్ డోర్లు విరిగిపోయాయి. కొన్ని కిటికీల డోర్లు కూడా పాడయ్యాయి. చల్లగాలి రాకుండా కిటికీలకు పిల్లలు చద్దర్లు అడ్డంగా పెట్టుకుంటున్నారు. తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలోని మహాత్మా జ్యోతిబాపూలే బాయ్స్ గురుకులంలో దుప్పట్లు ఇవ్వకపోవడంతో చలిలో పడుకుంటున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి బీసీ హాస్టల్ లో రగ్గులు వచ్చినా పంపిణీ చేయక ఒక చోట మూట కట్టి పెట్టారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా స్కూల్‌లో స్టూడెంట్స్‌కు సరిపడా బెడ్లు లేక కిందే పడుకుంటున్నారు. స్టూడెంట్లకు ఇప్పటికీ దుప్పట్లు ఇయ్యలేదు. ఇంటి నుంచి తెచ్చుకున్న దుప్పట్లే వాడుతున్నారు.
సుల్తానాబాద్ బీసీ, ఎస్సీ హాస్టళ్లలో పిల్లలు చలికి భయపడి మధ్యాహ్నం స్నానాలు చేస్తున్నారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లి గురుకుల స్కూల్‌లో గీజర్ లేక చన్నీళ్ల స్నానం చేయడంతో జ్వరాల బారిన పడుతున్నామని పిల్లలు తమ సమస్యను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ దృష్టికి తీసుకెళ్లారు.
మంచిర్యాల ఎస్సీ బాయ్స్ కాలేజ్ హాస్టల్‌లో సరిపడా బెడ్స్‌లేక నేలమీద పడుకుంటున్నారు. కిటికీల అద్దాలు పగిలిపోయాయి. తలుపులు కూడా సరిగా లేవు. తాంసి ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ లో బెడ్స్ లేక పిల్లలు క్లాస్‌రూంలో నేలపై పడుకున్నారు. కౌటాల మండలం మొగడ్ధగడ్ట్రైబల్వెల్ఫేర్హాస్టల్లో కిటికీలకు డోర్లు లేవు. బెడ్స్లేకపోవడంతో స్టూడెంట్స్ నేలపై పడుకున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏ ఒక్క చోటా గీజర్లు లేవు. దుప్పట్లు కూడా పంపిణీ చేయలేదు. కొన్ని చోట్ల కిటికీలకు అద్దాలు లేవు. వైరాలోని ఎస్సీ బాయ్స్ హాస్టల్ ఊరికి దూరంగా పొలాల మధ్య ఉండడంతో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్టీ హాస్టల్‌లో స్టూడెంట్స్పడుకునే హాల్ కిటికీలకు రెక్కలు లేవు.
నల్గొండ జిల్లా నార్కట్‌పల్లిలోని బాయ్స్ హాస్టల్‌లో బాత్రూంలలో నీళ్లు రాక బయటే చలిలో స్నానాలు చేస్తున్నారు. వాటర్ ట్యాంకులకు పైకప్పు లేకపోవడంతో చెత్తాచెదారం, పాకురు పట్టి నీళ్లు కలుషితమవుతున్నా క్లీన్ చేయడంలేదు. సూర్యాపేటలోని ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ లో 300 మందికి కేవలం ఐదు బాత్రూంలు మాత్రమే ఉన్నాయి. గడ్డిపల్లి ఎస్సీ హాస్టల్ లో ప్రభుత్వం ఇచ్చిన దుప్పట్లు పల్చగా ఉన్నాయి. అవి చలి నుంచి రక్షణ ఇవ్వడంలేదు. నాలుగేండ్ల కింద సప్లయ్ చేసిన పరుపులు చినిగిపోయాయి. యాదాద్రి జిల్లా మోత్కూరు బీసీ హాస్టల్‌లో చలికి పొద్దున స్నానం చేయకుండానే స్కూల్ కు వెళ్తున్నారు.
చలికి వణుకుతున్నం
హాస్టల్ చుట్టూ కంప చెట్లున్నయ్. ఈ ప్రాంతంలో ఉన్న వాళ్లు హాస్టల్ పక్కనే చెత్త పడేస్తరు. పెద్ద పెద్ద దోమలొస్తున్నయి. పొద్దున, రాత్రి చలికి వణికిపోతున్నం. దుప్పట్లు లేవు. రెండు బెడ్షీట్లు ఇచ్చిన్రు. వాటినే ఒక దాన్ని కింద పరిచి, మరొకటి కప్పుకుంటున్నం.
- మాధవి, కేజీబీవీ, నవాబ్‌పేట, మహబూబ్‌నగర్
నీళ్లను ఎండలో పెట్టి స్నానం చేస్తున్నం
నేను 6వ క్లాస్ చదువుతున్న. హాస్టల్‌లో మస్తు చలి పెడుతున్నది. పొద్దుగాళ్ల చల్లటి నీళ్లతోటి స్నానం చేసుడు కష్టమైతున్నది. బకెట్ల నీళ్లు తీసుకపోయి బిల్డింగ్ మీద కొంత సేపు ఎండలో పెట్టి ఆ తర్వాత ఆ నీళ్లతోటి స్నానం చేస్తున్నం.
- సాయి, కామారెడ్డి ఎస్సీ హాస్టల్ స్టూడెంట్