ఉర్దూ వర్సిటీలో విద్యార్థుల ఆందోళన..క్యాంపస్ భూములు తీసుకోవద్దని నిరసన

ఉర్దూ వర్సిటీలో విద్యార్థుల ఆందోళన..క్యాంపస్ భూములు తీసుకోవద్దని నిరసన

గచ్చిబౌలి, వెలుగు: గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీకి చెందిన 50 ఎకరాల భూమిని వెనక్కి తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నోటీసులపై బుధవారం విద్యార్థులు ఆందోళన చేపట్టారు. వర్సిటీ ఆవరణలోని సెంట్రల్ లైబ్రరీ నుంచి ప్రధాన గేట్ వద్దకు ర్యాలీగా తరలివచ్చి ‘ఉర్దూ యూనివర్సిటీ ప్రభుత్వ జాగీరు కాదు, యూనివర్సిటీ భూమిపై కన్నేస్తే ఖబడ్డార్’ అంటూ నినాదాలు చేశారు.

 1998లో ప్రభుత్వం యూనివర్సిటీకి కేటాయించిన 200 ఎకరాల్లో నిరుపయోగంగా ఉన్న 50 ఎకరాలను వెనక్కి తీసుకుంటామని రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి డిసెంబర్ 15న నోటీసులు జారీ చేశారన్నారు. వర్సిటీ భవిష్యత్తు అవసరాల కోసం మరింత భూమి కేటాయించాల్సిన ప్రభుత్వం ఉన్న భూమిని వెనక్కి తీసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోకపోతే భారీ ఆందోళన చేపడతామని హెచ్చరించారు.