
మెస్ బిల్లులు చెల్లించలేదనే కారణంతో ఫలితాలు ఆపడం అన్యాయమని జేఎన్టీయూ యూనివర్సిటీ విద్యార్ధులు వెల్లడించారు. వెంటనే ఫలితాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జేఎన్టీయూలో ఎన్నో సమస్యలు నెలకొన్నా.. పట్టించుకోవడం లేదన్నారు. శనివారం జేఎన్టీయూ యూనివర్సిటీ ప్రిన్సిపాల్ చాంబర్ ముందు విద్యార్ధులు బకెట్లతో బైఠాయించారు. విద్యార్థులకు హాస్టల్లో రాత్రి విద్యుత్ కోత పెట్టారని... తెల్లవారుజాము రెండు గంటల నుంచి ఉదయం 10 వరకు యూనివర్సిటీలో నీళ్లు అందుబాటులో లేదన్నారు. విద్యుత్ సమస్యతో దోమల సమస్య ఎక్కువైందని ఆందోళన వ్యక్తం చేశారు.
బీటెక్ రెండో సంవత్సరంలో రెండో సెమిస్టర్, మూడవ సంవత్సరంలో రెండో సెమిస్టర్.. ఒకటో సంవత్సరంలో రెండో సెమిస్టర్ ఫలితాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మెస్ బిల్లును చెల్లించలేదని ఫలితాలను ఆపడం ఎంతవరకు సమంజసమని విద్యార్థులు ప్రశ్నించారు. ఉత్తీర్ణత పొందిన విద్యార్థులకు రెండు రోజుల్లో రావాల్సిన మెమోలు 10 రోజులైనా రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నామన్నారు. గతంలో పలమార్లు ఫిర్యాదు చేసిన ఎలాంటి పరిష్కారం కాకపోవడంతో బైఠాయించామన్నారు. సమస్య పరిష్కారమయ్యేంతవరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని స్పష్టం చేశారు.