
ఓయూ, వెలుగు : ఉస్మానియా యూనివర్సిటీ లోని హాస్టళ్లకు కరెంట్, నీటి సప్లయ్‌ను పునరుద్ధరించాలంటూ విద్యార్థులు మంగళవారం రోడ్డె క్కారు. వర్సిటీ లేడీస్ హాస్టల్ ముందు బైఠాయించి వంటావార్పుతో నిరసన తెలిపారు. స్టూడెంట్లు మాట్లాడుతూ..గ్రూప్-–1 ఎగ్జామ్‌కు వారం ఉందనగా కరెంట్, నీటి సప్లయ్ నిలిపివేయడం బాధాకరమన్నారు. వీసీ రవీందర్ వైఖరితో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నియంత పోకడలతో తమ జీవితాలను ఆగం చేస్తున్నారని మండిపడ్డారు. కరెంట్, నీటి సప్లయ్‌ను పునరుద్ధరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు.
26 నుంచి రీ ఓపెన్ చేస్తం: రిజిస్ట్రార్
ఈ నెల 26 నుంచి అకడమిక్ ఇయర్ ప్రారంభం కానుందని, అప్పటి నుంచి వర్సిటీలోని హాస్టళ్లను రీ ఓపెన్ చేస్తామని ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ వెల్లడించారు. ప్రస్తుతం ఓయూలో అన్ని సెమిస్టర్లు ముగిశాయని, 27 నుంచి జరగాల్సిన బీఎడ్, లా కోర్సుల పరీక్షలు నవంబరు1కి వాయిదా పడ్డాయన్నారు. ప్రస్తుతం స్టూడెంట్లంతా హాస్టళ్లను ఖాళీ చేసి ఇండ్లకు వెళ్లిపోయారన్నారు. దీంతో హాస్టల్ భవనాలకు రిపేర్లు చేస్తున్నామని, అందుకే కరెంట్, నీటి సప్లయ్ బంద్ చేశామన్నారు. 26లోగా రిపేర్లు పూర్తిచేసి హాస్టళ్లను రీఓపెన్ చేస్తామన్నారు.