కామారెడ్డి జిల్లా లో అన్న గెలిచిండనే జోష్లో ఓడినోళ్లపైకి ట్రాక్టర్ ఎక్కించిండు

కామారెడ్డి జిల్లా లో  అన్న గెలిచిండనే జోష్లో ఓడినోళ్లపైకి ట్రాక్టర్ ఎక్కించిండు
  • నలుగురికి గాయాలు.. ఇద్దరికి సీరియస్
  • కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో ఘటన

ఎల్లారెడ్డి, వెలుగు: తన అన్న సర్పంచ్​గా గెలిచాడన్న జోష్​లో అతని తమ్ముడు.. ఓడిపోయిన అభ్యర్థి తాలూకు మనుషులపై ట్రాక్టర్  ఎక్కించాడు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమార్​పేట్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. సోమార్​పేట పంచాయతీకి ఆదివారం ఎన్నికలు జరగగా బీఆర్ఎస్  మద్దతు ఇచ్చిన బిట్ల బాలరాజుపై కాంగ్రెస్​ మద్దతు ఉన్న అభ్యర్థి కురుమ పాపయ్య విజయం సాధించారు. దీంతో సోమవారం బాలరాజు బంధువులు అతన్ని పరామర్శించేందుకు వచ్చారు. 

పాపయ్య తమ్ముడు కురుమ చిరంజీవులు అదే సమయంలో ట్రాక్టర్​పై బాలరాజు ఇంటి ముందు నుంచి వెళ్తున్నాడు. తన అన్న పై పోటీ చేశారన్న కక్షతో ట్రాక్టర్​ను బాలరాజు ఇంటిపైకి ట్రాక్టర్​ మళ్లించాడు. ట్రాక్టర్​ను ఇంటి మీదకు ఎక్కించే ప్రయత్నంలో బాలరాజు చిన్న గాయాలతో తప్పించుకున్నారు. అతన్ని పరామర్శించేందుకు వచ్చిన వారిలో నలుగురు మహిళలు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన గంజి భారతి, తోట శారద పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో హైదరాబాద్ కు తరలించారు. 

బాలమణి, సత్యవ్వ ఎల్లారెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రాజకీయ కక్షతోనే దాడికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ బీఆర్ఎస్​ లీడర్లు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దాడి చేసిన చిరంజీవులుతో పాటు అతన్ని ప్రోత్సహించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్  చేస్తూ ఎల్లారెడ్డి, నిజాంసాగర్  రోడ్డుపై రాస్తారోకో చేశారు. పోలీసులు ఆందోళనకారులతో మాట్లాడి రాస్తారోకోను బంద్ చేయించారు. బాధితుడు బాలరాజు  ఫిర్యాదుతో నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.