విద్యార్థుల నిరసనకు  గ్రామస్తుల మద్దతు.. రాస్తారోకో

విద్యార్థుల నిరసనకు  గ్రామస్తుల మద్దతు.. రాస్తారోకో

ఇబ్రహీంపట్నం (రంగారెడ్డి జిల్లా): స్కూళ్లు, కాలేజీలకు వెళ్లేందుకు టైంకు బస్సులు నడపకపోవడంతో తీవ్ర ఇబ్బందులుపడుతున్న విద్యార్థులు తమ ఆవేదనను తెలియజేసేందుకు గ్రామ బస్టాండులో నిరసన చేపట్టగా.. విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు సైతం మద్దతు ప్రకటించి రాస్తారోకో చేపట్టారు. రంగా రెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామంలో ఇవాళ బస్సులను ఆపి ధర్నా నిర్వహించారు. దీంతో ఆ మార్గంలో బస్సులు, ఇతర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. 
రాయపోల్ గ్రామం నుండి ఇబ్రహీంపట్నంకు ప్రతిరోజు వివిధ పనులపై చదువుల కోసం వందల సంఖ్యలో ప్రయాణం చేస్తుండగా.. కొంత కాలంగా టైముకు బస్సులు రాకపోవడంతో ఆలస్యంగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి, ఇతర పనులకు కూడా సామాన్యులకు చాలా కాలయాపన జరుగుతూ ఇబ్బందిపడుతున్నామని గ్రామస్తులు తెలిపారు.

‘‘ప్రతి రోజు ఉదయం 8.30గంటల సమయంలో గ్రామానికి వచ్చే బస్సులు పక్క  గ్రామాల్లోనే ప్రయాణికులు నిండిపోయి వస్తున్నాయి. బస్సుల్లో జాగా లేక.. దొరక్క వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఉదయం పూట బస్సులన్నీ కిక్కిరిసిన ప్రయాణికులతో నడుస్తుండడం వల్ల విద్యార్థులు, గ్రామస్తులు ఆర్టీసీ బస్సుల్లో వెళ్లేందుకు వీలు లేని పరిస్థితుల్లో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. బస్సు పాసులు ఉన్నప్పటికీ ప్రయోజనగం లేక..  ప్రైవేట్ వాహనాల్లో చార్జీలు పెట్టె స్థోమత చాలా మంది విద్యార్థులకు లేదు. అందుకే ఈ రోజు ఉదయం దండు మైలారం నుండి వచ్చిన బస్సు లో జాగా లేక పూట్ బోర్డు పైన నిల్చొవడానికి కూడా అవకాశం లేకపోవడంతో బస్సును ఆపేసి నిరసన చేపట్టాము..’’ అని విద్యార్థులు చెప్పారు. విద్యార్థులకు మద్దతుగా రాయపోలు గ్రామ సర్పంచు రోడ్డుపై బెఠాయించి నిరసనలో పాల్గొన్నారు. గ్రామానికి సరిపడా బస్సులు నడపాలని ఆర్టీసీ వారిని కోరినా ఫలితం లేదన్నారు. గ్రామానికి ఉదయం పూట ప్రత్యేక బస్సును నడపాలని వారు డిమాండ్ చేశారు.