ఆదిలాబాద్, వెలుగు: రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు రోడ్డు భద్రత నియమాలపై జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శనివారం స్కూల్ విద్యార్థులు ‘ఫ్లాష్ మాబ్’ కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని కలెక్టరేట్ చౌక్, వినాయక్ చౌక్ లో ‘ఫ్లాష్ మాబ్’ చేపట్టారు. హెల్మెట్ ఆవశ్యకత, రోడ్డుపై పశువులు సంచరిస్తుండడంతో జరుగుతున్న ప్రమాదాలు, సిగ్నల్స్, ట్రాఫిక్ నియమాలపై అవగాహనతో కూడిన నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది.
ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్ లాంటివి చేయకుండా ఈ కార్యక్రమం చేపట్టినట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో పట్టణ సీఐలు సునీల్ కుమార్, నాగరాజు, కర్రె స్వామి, ప్రేమ్ కుమార్, ప్రణయ్ కుమార్, ట్రాఫిక్ ఎస్సైలు దేవేందర్, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
