వాష్ రూం వెంటిలెటర్ నుంచి చేతులు పెట్టి, పిలిచారు.. ఓయూ లేడీస్ హాస్టల్ స్టూడెంట్స్ ఆవేదన

వాష్ రూం వెంటిలెటర్ నుంచి చేతులు పెట్టి, పిలిచారు.. ఓయూ లేడీస్ హాస్టల్ స్టూడెంట్స్ ఆవేదన

సికింద్రాబాద్‌లోని ఉస్మానియా యూనివర్శిటీలోని లేడీస్ హాస్టల్ లోకి ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించేందుకు ప్రయత్నించారని పీజీ మహిళా విద్యార్థినులు నిరసన చేపట్టారు. క్యాంపస్ దగ్గర విద్యార్థులు దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ నిరసనకు దిగడంతో హై వోల్టేజ్ డ్రామా చోటుచేసుకుంది. యూనివర్శిటీలోని లేడీస్ హాస్టల్ ఆవరణలోకి చొరబడిన ఆగంతకులు కొందరు విద్యార్థినులపై దాడికి ప్రయత్నించారని స్టూడెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్‌లోని ఇతర విద్యార్థులు రంగంలోకి దిగి దాడి చేసిన వారిని పట్టుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలోనూ హల్ చల్ చేస్తోంది. అందులో దాడి చేసిన వారిలో ఒకరు చేతులు కట్టుకుని మోకరిల్లినట్లు కనిపిస్తున్నాడు. ఆగ్రహించిన విద్యార్థులు క్షమించమని వేడుకున్న దుండగుడిని తన్నడం, కొట్టడం కనిపిస్తోంది.

ఓ మహిళా విద్యార్థిని వాష్ రూంలోకి వెళ్లగానే.. వెంటలెటర్ నుంచి ఎవరో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చేతులు లోపలికి పెట్టి పిలిచారని స్టూడెంట్స్ చెప్పారు. ఆ తర్వాత ఆమె గట్టిగా అరవడంతో విషయం అందరికీ తెలిసి బయటికొచ్చామని.. ఈ క్రమంలో ఓ విద్యార్థినిని సైతం వారు గాయపర్చారన్నారు. ఎట్టకేలకు ముగ్గురిలో ఒక్కరినైతే పట్టుకోగలిగామని, కానీ మరో ఇద్దరు మాత్రం అక్కడ్నుంచి తప్పించుకుని పారిపోయారని వాపోయారు. వాళ్లను పట్టుకున్నా కూడా.. తమను అసభ్యంగా ధూషించారన్నారు. పట్టుబడ్డ నిందితున్ని పోలీసులకు అప్పగించిట్టు సమాచారం.

ఈ ఘటనపై నిరసించిన విద్యార్థులు.. హాస్టళ్లలో భద్రత కల్పించాలని, సీసీటీవీలను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థుల డిమాండ్లపై అధికారులు కృషి చేస్తానని ప్రిన్సిపాల్ హామీ ఇచ్చినట్లు సమాచారం. హాస్టల్ లో దాదాపు 250మంది మహిళా విద్యార్థినిలుండగా.. అంతమందికి ఒకే ఒక్క మహిళా వార్డెన్ మాత్రమే ఉన్నారని, హాస్టల్ వెనక జరుగుతోన్న భవన నిర్మాణ కార్మికుల వల్ల కూడా ఇబ్బందిగా ఉంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు జరిగిన ప్రతీసారి ఏదో ఒక హామీ ఇచ్చి వెళ్లిపోతున్నారు.. కానీ ఆ తర్వాత ఎలాంటి చర్యలుండడం లేదని స్టూడెంట్స్ ఆరోపించారు.