‘మన ఊరు–మన బడి’ పనులకు గ్రహణం

‘మన ఊరు–మన బడి’ పనులకు గ్రహణం
  • పిల్లర్ల వరకే బిల్డింగులు.. చెట్ల కిందే చదువులు
  • ‘మన ఊరు–మన బడి’ పనులకు గ్రహణం
  • చెట్ల కిందే చదువుకుంటున్న విద్యార్థులు

వరంగల్‍, కొత్తగూడ, వెలుగు: గ్రామాల్లో చేపట్టిన ‘మన ఊరు– మన బడి’, పట్టణాల్లో ప్రారంభించిన ‘మన బస్తీ–మన బడి’ పథకం పనులు మధ్యలోనే ఆగిపోయాయి. సర్కారు నుంచి బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. ఆర్భాటంగా శంకుస్థాపనలు చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు పనుల్ని పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో ఆఫీసర్లు సైతం లైట్ తీసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చాలా స్కూళ్లలో ఇదే పరిస్థితి ఉంది.

చెట్లే దిక్కు..

‘మన ఊరు-–మన బడి’ కింద ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 1,163 పాఠశాలలను ఎంపిక చేశారు. మొదట 418 బడుల్లో ఈ ప్రోగ్రాంను ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా అదనపు గదులు, టాయిలెట్లు, ప్రహరీ గోడలు, కిచెన్​షెడ్లు, డైనింగ్‌‌‌‌ హాల్‌‌‌‌, గ్రీన్‌‌‌‌ బోర్డులు, పెయింటింగ్‌‌‌‌, విద్యుత్‌‌‌‌, ఫర్నిచర్‌‌‌‌, తాగునీటి వసతి, ల్యాబ్‌‌‌‌ వంటివి నిర్మించాలని సర్కారు నిర్ణయించింది. కానీ సర్కారు నుంచి బిల్లులు రాకపోవడంతో పనులు పిల్లర్లు దాటలేదు. దీంతో చెట్ల కిందే పిల్లలు చదువులు సాగిస్తున్నారు. మధ్యాహ్న భోజనం సైతం చెట్ల కిందే చేస్తున్నారు. టాయిలెట్లు లేక స్టూడెంట్లు తిప్పలు పడుతున్నారు. కాగా, మధ్యలోనే పనులు ఆగిపోవడం వల్ల.. అవి పిల్లలకు ప్రమాదకరంగా మారాయి. గుంతలు, ఐరన్ రాడ్లు, పిల్లర్లతో స్టూడెంట్లకు ప్రమాదం పొంచి ఉంది.

రూ.100 కోట్లకు.. రూ.2 కోట్లతో మమ..

ఈ పథకానికి సంబంధించిన పనులకు ఎస్టిమేషన్‍ ఒకలా.. కేటాయింపులు మరోలా చేశారు. స్కూళ్ల జాబితా ఆధారంగా ఒక్కో జిల్లాకు రూ.80 కోట్లు నుంచి రూ.100 కోట్లు అవసరం ఉండగా కేవలం రూ. 2 కోట్ల చొప్పున ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో పలుచోట్ల పనులు మొదలుపెట్టలేదు. మొదలైన చోట్ల పిల్లర్ల దశ దాటలేదు. చిన్న చిన్న పనులు సైతం పూర్తి చేయడంలో నిర్లక్ష్యం చేస్తోంది. పనులు ప్రారంభించిన తొలి వారం రోజులు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆఫీసర్లు విస్తృతంగా స్కూళ్లను పరిశీలించి, వెంటనే పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. సర్కారు బిల్లులు రాకపోవడంతో అటువైపు కన్నెత్తి చూడడం లేదు. స్కూల్​ను విజిట్ చేస్తే.. ఎక్కడ విమర్శలు వస్తాయోనని జంకుతున్నారు.

ఫండ్స్ ఇవ్వలేదని కాంట్రాక్టర్లు పనులాపిన్రు

గ్రేటర్‍ వరంగల్ దేశాయిపేట స్కూళ్ల తరగతి గదులు శిథిలావస్థకు చేరాయి. వాటి స్థానంలో కొత్త భవణాల నిర్మాణం కోసం 'మన బస్తీ - మన బడి' పథకం కింద రూ.40 లక్షలు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. పనులు స్లాబ్ వరకు చేశారు. కాగా, కాంట్రాక్టర్‍కు రావాల్సిన బిల్లులు ఆగడంతో అతను పనులను మధ్యలో వదిలేసి వెళ్లాడు. అప్పటినుంచి విద్యార్ధులకు ఇబ్బందులు తప్పట్లేదు. 

పనుల్లో జాప్యం.. పిల్లలకు శాపం: పి. వేణు, టీచర్‍, హనుమకొండ

ఇది మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం తిరుమలగండి ఎంపీపీఎస్ స్కూల్. ఇక్కడ రూ.16.26లక్షలతో కాంపౌండ్ వాల్, అదనపు గదులు, కిచెన్ షెడ్, వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులు మొదలుపెట్టగా.. బిల్లులు రాకపోవడంతో సదరు కాంట్రాక్టర్ మధ్యలోనే వదిలేశాడు. పిల్లర్ల కోసం తీసిన గుంతలు, ఐరన్ రాడ్లు పిల్లలకు ప్రమాదకరంగా మారాయి. కిచెన్ షెడ్ లేక ఆరుబయటే అన్నం తింటున్నారు.