- ఓపెన్ టెన్త్, ఇంటర్‌కు మస్తు అప్లికేషన్లు
- గతేడాది 61 వేల అప్లికేషన్లు.. కరోనాతో అందరినీ పాస్ చేసిన సర్కారు
- ఈసారీ అట్లానే పాస్ అవుతామనే ఆశతో 89 వేల మంది దరఖాస్తు
హైదరాబాద్, వెలుగు: ఏండ్ల నుంచి టెన్త్, ఇంటర్ పాస్ కానోళ్లకు కరోనా ఓ మంచి అవకాశంగా మారింది. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా అందరినీ పాస్ చేస్తారనే ఆశతో ‘ఓపెన్ స్కూల్’ లో చదివేందుకు అభ్యర్థులు క్యూ కట్టారు. గత ఐదేండ్లతో పోలిస్తే ఈసారి ఎక్కువ మంది అప్లై చేసుకున్నారు. గతేడాదితో పోలిస్తే ఏకంగా 28వేల దరఖాస్తులు ఎక్కువ వచ్చాయి.
గతేడాది మినిమమ్ మార్కులతో పాస్
రాష్ట్రంలో వివిధ కారణాలతో మధ్యలో చదువు ఆపేసిన వారందరికీ తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) ద్వారా ఎస్సెస్సీ, ఇంటర్ చదివే అవకాశముంది. 14 ఏండ్లు నిండిన వాళ్లు ఎస్సెస్సీ, 15 ఏండ్లు నిండిన వాళ్లు ఇంటర్ పరీక్షలకు అప్లై చేసుకోవచ్చు.
ఇంటర్‌కు మస్తు అప్లికేషన్లు
ఇలా పాసైన స్టూడెంట్లను రెగ్యులర్ వాళ్లతో సమానంగా పరిగణిస్తుండటంతో ప్రస్తుతం ఈ పరీక్షలకు డిమాండ్ పెరిగింది. యేటా ఈ ఎగ్జామ్స్‌లో ఎస్సెస్సీ, ఇంటర్‌కు అప్లై చేసిన వాళ్లు 25 శాతం నుంచి 35 శాతం లోపే పాసవుతుంటారు. అయినా ప్రతి సంవత్సరం 50 వేల నుంచి 60 వేల మంది అప్లై చేసుకుంటుంటారు. గతేడాది 61,294 మంది అప్లై చేశారు. ఇందులో ఇంటర్‌కు 28,517 మంది, ఎస్సెస్సీకి 32,777 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరితో పాటు మరో 17వేల మంది బ్యాక్ లాగ్ స్టూడెంట్లు ఎగ్జామ్ ఫీజు కట్టారు. గతేడాది కరోనా తీవ్రత నేపథ్యంలో మొత్తం 78 వేల మందిని మినిమమ్ మార్కులతో ప్రభుత్వం పాస్ చేసింది. టాస్ చరిత్రలో వంద శాతం పాస్ ఇదే తొలిసారి.
ఈసారి అప్లికేషన్లు 89,454
ఈ ఏడాది జులైలో జరిగే టాస్ పరీక్షల కోసం 89,454 మంది అప్లై చేసుకున్నారు. వీళ్లలో ఎస్సెస్సీకి 50,502 మంది, ఇంటర్‌కు 38,952 మంది దరఖాస్తు చేసుకున్నారు. సోమవారం నుంచి మే10 వరకు ఫైన్ లేకుండా ఎగ్జామ్ ఫీజు కట్టొచ్చని అధికారులు ప్రకటించారు. దీంతో గతంలో ఒకటీ, రెండు సబ్జెక్టులు పోయిన చాలా మంది అప్లై చేసుకుంటారని ఆఫీసర్లు భావిస్తున్నారు. ఈసారీ రెగ్యులర్ టెన్త్ ఎగ్జామ్స్, ఇంటర్ ఫస్టియర్ స్టూడెంట్లను పరీక్షలు లేకుండానే పాస్ చేయడంతో ఓపెన్ టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ రద్దు చేస్తారని స్టూడెంట్లు అనుకుంటున్నారు.
