టీచర్ల కోసం స్టూడెంట్స్ ఆందోళన.. ఉన్నోళ్లను వేరే చోటికి పంపిన ఆఫీసర్లు

టీచర్ల కోసం స్టూడెంట్స్ ఆందోళన.. ఉన్నోళ్లను వేరే చోటికి పంపిన ఆఫీసర్లు

టీచర్ల కోసం స్టూడెంట్స్ ఆందోళన

ఉన్నోళ్లను వేరే చోటికి పంపిన ఆఫీసర్లు 

హత్నూర - సిరిపుర రోడ్డుపై  ధర్నా 

మద్దతు తెలిపిన తల్లిదండ్రులు 

సంగారెడ్డి (హత్నూర), వెలుగు : టీచర్ల కోసం స్టూడెంట్స్ ఆందోళన బాట పట్టారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం సిరిపుర సమీపంలోని జోగిపేట్--–నర్సాపూర్ మెయిన్​రోడ్డుపై మంగళవారం రోడ్డుపై బైఠాయించి ‘మా టీచర్లను మాకు ఇవ్వండి’ అంటూ ధర్నా, రాస్తారోకో చేశారు. వీరికి తల్లిదండ్రులు కూడా మద్దతు పలికి నిరసనలో పాల్గొన్నారు. సిరిపుర ప్రభుత్వ ప్రైమరీ స్కూల్​లో 130 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. వీరికి ఐదుగురు టీచర్లుండగా, ఒకరు డిప్యూటేషన్ పై వెళ్లారు. మరో ఇద్దరు లోకల్ గా ఉన్న తండాల్లోని స్కూళ్లలో చదువు చెప్పేందుకు తరచూ వెళ్తున్నారు. దీంతో ఇక్కడి స్టూడెంట్ల చదువులు సాగడం లేదు. 

ఈ విషయంపై చాలాసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. దీంతో విసుగు చెందిన విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి మంగళవారం ఆందోళనకు దిగారు. దాదాపు రెండు గంటలసేపు రాస్తారోకో చేయడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో హత్నూర ఎస్ఐ లక్ష్మారెడ్డి అక్కడికి వచ్చి ఫోన్ లో ఆఫీసర్లతో మాట్లాడారు. సమస్య పరిష్కారమయ్యేందుకు కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.