ఉస్మానియా వర్సిటీలో సమస్యలను పరిష్కరించాలి

ఉస్మానియా వర్సిటీలో సమస్యలను పరిష్కరించాలి
  •     ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనానికి యత్నించిన స్టూడెంట్లు
  •     అడ్డుకుని అరెస్ట్ చేసిన పోలీసులు

ఓయూ, వెలుగు: ఉస్మానియా వర్సిటీలో నెలకొన్న సమస్యలపై రెండు నెలలుగా ఆందోళన చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదంటూ స్టూడెంట్లు బుధవారం ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద నిరసన చేపట్టారు. ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించారు. వారిని అడ్డుకున్న పోలీసులు దిష్టిబొమ్మను లాక్కున్నారు. స్టూడెంట్లను అరెస్ట్ చేసి ఓయూ పీఎస్​కు తరలించారు. అనంతరం విద్యార్థి సంఘాల నాయకులు ఆజాద్, సత్య మాట్లాడుతూ.

యూనివర్సిటీలో ఫీజుల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, అడ్మిషన్ పొందిన ప్రతి స్టూడెంట్​కు హాస్టల్, మెస్ ఫెలోషిప్ సౌకర్యం కల్పించాలని 2 నెలలుగా ఆందోళన చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఈ విషయమై ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్, విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి, హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రికి పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా రెస్పాన్స్ లేదన్నారు.  ఓయూతో పాటు రాష్ట్రంలోని అన్ని వర్సిటీల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేకపోతే ఆందోళనలను ఉధృతం చేస్తామని  హెచ్చరించారు.