
- ఓయూ విద్యార్థి సంఘాల నిరసన
ఓయూ,వెలుగు : లోక్ సభ టికెట్లలో మాదిగలకు తగిన సీట్లు కేటాయించాలని ఓయూలో విద్యార్థి సంఘాలు నిరసన ప్రదర్శన చేపట్టాయి. ఎస్ టీఎస్ఏ, ఎస్ఎస్ఎఫ్,ఎంఎస్ యూ, జేఏసీ సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం ఓయూ లా కాలేజీ వద్ద మోకాళ్లపై కూర్చుని, నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత మాదిగలపై వివక్ష చూపుతున్నారని పలువురు విద్యార్థి సంఘ నేతలు ఆరోపించారు.
గత బీఆర్ఎస్ పాలనలో వివక్షకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ని గెలిపించిన మాదిగలపై మళ్లీ అదే వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. నామినేషన్ల గడువు ముగిసేలోపు మాదిగలకు తగిన టికెట్లను కాంగ్రెస్ కేటాయించి న్యాయం చేసి మద్దతు పొందాలని కోరారు. విద్యార్థి సంఘాల నేతలు తాళ్లఅజయ్, చాగంటి రాజేశ్,శాంతికుమార్, బోనాల నగేష్,లింగంపల్లి మనోజ్, కార్తీక్, సురేష్, నరేష్, సురేష్, గడ్డం స్వామి, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.