ఇంటర్​లో టాప్ ఎంసెట్​లో వీక్.. కార్పొరేట్ కాలేజీల స్టూడెంట్లకు వేలల్లో ర్యాంకులు 

ఇంటర్​లో టాప్  ఎంసెట్​లో వీక్.. కార్పొరేట్ కాలేజీల స్టూడెంట్లకు వేలల్లో ర్యాంకులు 
  • కార్పొరేట్ కాలేజీల స్టూడెంట్లకు వేలల్లో ర్యాంకులు 


హైదరాబాద్, వెలుగు,  రాష్ట్రంలో రెండు వారాల కింద ఇంటర్ ఫలితాలు రిలీజ్ కాగా, నాలుగు రోజుల కింద ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. అయితే ఇంటర్ లో టాప్​మార్కులు పొందిన చాలామంది స్టూడెంట్లు.. తమ ఎంసెట్ ర్యాంకులను చూసి అయోమయానికి గురవుతున్నారు. లక్షల్లో ఫీజులు కట్టి కార్పొరేట్ కాలేజీల్లో చదివించిన చాలామంది పేరెంట్స్... ఎంసెట్ లో తమ పిల్లలకు వచ్చిన మార్కులు చూసి లబోదిబోమంటున్నారు. ఈసారి ఎంపీసీ సెకండియర్​లో 1.65 లక్షల మంది పరీక్షలు రాస్తే, వారిలో 1.20 లక్షల మందికి పైగా స్టూడెంట్లు పాసయ్యారు. ఎంసెట్​ ఇంజినీరింగ్ స్ర్టీమ్​లో 1.95 లక్షల మంది ఎగ్జామ్ రాయగా, వారిలో 1.56 లక్షల మంది క్వాలిఫై అయ్యారు. అయితే ఇంటర్ లో మంచి మార్కులతో పాసైన వేలాది మంది విద్యార్థులు.. ఎంసెట్ లో మాత్రం రాణించలేకపోయారు. 950కి పైగా మార్కులు సాధించిన స్టూడెంట్లు సైతం ఎంసెట్ లో 60 వేలకు పైనే ర్యాంకులు పొందడం విస్మయానికి గురిచేస్తోంది. 900కు పైగా మార్కులు సాధించిన స్టూడెంట్లు కొందరు క్వాలిఫై కూడా కాలేదని తెలుస్తోంది. హైదరాబాద్ లోని ఓ కార్పొరేట్ కాలేజీ టాపర్ కు ఏకంగా 90 వేలకు పైగా ర్యాంక్ రావడం గమనార్హం. సాధారణ ప్రైవేట్ కాలేజీలు, సర్కారు కాలేజీల్లో చదివిన చాలామంది స్టూడెంట్లు ఎలాంటి కోచింగ్ లేకుండానే 50 వేల లోపు ర్యాంకులు తెచ్చుకున్నారు. కార్పొరేట్ కాలేజీల్లో లక్షల్లో ఫీజులు చెల్లించి చదివిన స్టూడెంట్స్ మాత్రం ఇలా వెనుకబడడంతో వాళ్ల తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పుడు మళ్లీ ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్లకు లక్షల్లో డబ్బులు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. 

అవగాహన కల్పిస్తలేరు..  

ఇంటర్ సబ్జెక్టు క్వశ్చన్ పేపర్ కు, ఎంసెట్ క్వశ్చన్ పేపర్​కు చాలా తేడా ఉంటుంది. ఇంటర్ లో మూడేండ్ల క్వశ్చన్ పేపర్లు ప్రిపేర్ అయితే, 80%  మార్కులు పొందొచ్చని ఎక్స్ పర్ట్ చెబుతున్నారు. కానీ ఎంసెట్ దీనికి పూర్తి భిన్నంగా ఉంటుంది. దీనిపై కాలేజీల్లో స్టూడెంట్లకు పెద్దగా అవగాహన కల్పించడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇంటర్ పేపర్లలో డైరెక్ట్ క్వశ్చన్లు ఉంటాయి. పైగా చాయిస్ తో పాటు టైమ్​ కూడా బాగానే ఉంటుంది. కానీ ఎంసెట్ క్వశ్చన్ పేపర్ పూర్తిగా ఆలోచనతో చేయాల్సి ఉంటుంది. 160 క్వశ్చన్లను మూడు గంటల్లో పూర్తి చేయాలి. ఒక్కోసారి ఒక్కో క్వశ్చన్ ను సాల్వ్ చేసేందుకు ఐదారు నిమిషాలకు పైగా పట్టొచ్చు. ఇలాంటప్పుడు టైమ్ మేనేజ్మెంట్ చాలా కీలకం. అయితే  ఈ అంశాలపై కార్పొరేట్ కాలేజీల స్టూడెంట్లలో అవగాహన కల్పించడం లేదనే విమర్శలు ఉన్నాయి.

హైదరాబాద్ ఎల్బీనగర్​ ఏరియాలోని కార్పొరేట్ కాలేజీలో చదివిన ఓ స్టూడెంట్ కు ఇంటర్​లో 988 మార్కులు వచ్చాయి. దీంతో ఎంసెట్​లోనూ మంచి మార్కులు వస్తాయని పేరెంట్స్ భావించారు. తీరా రిజల్ట్ చూస్తే 90 వేలకు పైగా ర్యాంకు వచ్చింది. దీంతో పేరెంట్స్ తల పట్టుకున్నారు. హిమాయత్ నగర్​లోని ఓ కార్పొరేట్ కాలేజీలో చదివిన స్టూడెంట్ కు 947 మార్కులు వచ్చాయి. ఎంసెట్, జేఈఈ కోచింగ్ అంటూ మేనేజ్మెంట్ ప్రత్యేక ఫీజూలు వసూలు చేసింది. కానీ తీరా ఎంసెట్ లో ఆ స్టూడెంట్​కు 1.14 లక్షల ర్యాంకు వచ్చింది.  ఇది ఈ ఇద్దరు మెరిట్ స్టూడెంట్లకు మాత్రమే ఎదురైన పరిస్థితి కాదు. రాష్ట్రంలోని పలు కార్పొరేట్ కాలేజీల్లో చదివిన వేలాది మంది స్టూడెంట్లకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. విద్యార్థులకు వచ్చిన ఇంటర్ మార్కులకు, ఎంసెట్ లో వచ్చిన ర్యాంకులకు అసలు పొంతనే లేదు. 

బట్టీ విధానం వల్లనే... 

ఈ ఏడాది ఎంసెట్​లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ లేదు. కేవలం ఎంసెట్​లో వచ్చిన మార్కుల ఆధారంగానే ర్యాంకులు కేటాయించారు. భవిష్యత్​లోనూ ఇదే విధానం కొనసాగనున్నది. దీని ప్రభావం కార్పొరేట్ కాలేజీల్లో చదివే స్టూడెంట్లపై ఎక్కువగా పడింది. ఆ కాలేజీల్లో ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఇంటర్​లో ర్యాంకుల కోసం చదివించి, స్టూడెంట్లతో పాఠాలన్నీ బట్టీ పట్టిస్తున్నారు. ఈ క్రమంలో ఎంసెట్ ను ఎలా ఎదుర్కోవాలనే దానిపై స్టూడెంట్లలో అవగాహన కల్పించడం లేదు. గతంలో అయితే ఎంసెట్​లో వచ్చే మార్కులకు 75% వెయిటేజీ ఉండగా, ఇంటర్ మార్కులకు 25% వెయిటేజీ ఇచ్చేవారు. దీంతో ఎంసెట్ లో మాములు మార్కులు వచ్చినా, ఇంటర్ మార్కుల ఆధారంగా ఏకంగా 20–24 మార్కులు అదనంగా పొందేవారు. దీంతో ఒకేసారి వేలల్లో ర్యాంకులు మారిపోయేవి. దీనివల్ల ఇప్పటి వరకు కార్పొరేట్ చదువుల తీరు పెద్దగా బయటకు తెలియలేదు. కానీ ఈసారి వెయిటేజీ బట్టీ చదువుల విధానం బయటపడిందని విద్యావేత్తలు అంటున్నారు.