దూసుకెళ్తున్న 5జీ

దూసుకెళ్తున్న 5జీ
  • 2028 నాటికి కనెక్షన్లలో 5జీ వాటా 57 శాతం
  • అప్పటికి 5జీ యూజర్ల సంఖ్య 70 కోట్లు
  • వెల్లడించిన ఎరిక్సన్​ స్టడీ రిపోర్ట్​

న్యూఢిల్లీ: మనదేశంలో 5జీ  యూజర్ల సంఖ్య 2028 చివరి నాటికి దాదాపు 70 కోట్ల మందికి చేరుకుందని తాజా స్టడీ వెల్లడించింది.  మొబైల్ సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్క్రిప్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో దాదాపు 57 శాతం 5జీ కనెక్షన్లే ఉంటాయని తెలిపింది. గత ఏడాదిలోనే వీటి సంఖ్య కోటికి చేరిందని వెల్లడించింది.  ప్రపంచవ్యాప్తంగా "వేగంగా అభివృద్ధి చెందుతున్న" 5జీ ప్రాంతంగా ఇండియా ఎదుగుతోందని ఎరిక్సన్ మొబిలిటీ రిపోర్ట్ తెలిపింది.  గత అక్టోబర్​లో మనదేశంలో 5జీ సేవలను ప్రారంభించారు. అప్పటి నుంచి 5జీ  నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్​ను కంపెనీలు భారీగా విస్తరించాయి. కొన్ని మార్కెట్లలో భౌగోళిక, రాజకీయ సవాళ్లు,  స్థూల ఆర్థిక మందగమనం ఉన్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా కమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్లు 5జీలో పెట్టుబడులు పెట్టడం ఆపలేదు. 5జీ మొబైల్ సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్క్రిప్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ప్రతి ప్రాంతంలోనూ పెరుగుతున్నాయి.  2023 చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా వీటి సంఖ్య 1.5 బిలియన్లకు చేరుకోవచ్చు. ఉత్తర అమెరికాలో 5జీ సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్క్రిప్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల పెరుగుదల ఊహించిన దాని కంటే బలంగా ఉంది. ఈ ప్రాంతంలో 2022 చివరి నాటికి 41 శాతం కనెక్షన్లు 5జీవి ఉన్నాయి.

గ్లోబల్ మొబైల్ నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్ డేటా ట్రాఫిక్ పెరుగుతూనే ఉంది.2023 చివరి నాటికి ప్రతి స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నెలవారీ డేటా సగటు వినియోగం 20 జీబీ కంటే ఎక్కువగా ఉంటుంది.  ప్రముఖ 5జీ మార్కెట్లలో కంపెనీలకు ఆదాయాలు కూడా బాగున్నాయని ఎరిక్సన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్  (నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్స్) హెడ్ ఫ్రెడ్రిక్ జెజ్డిలింగ్ చెప్పారు. గత రెండేళ్ళలో, టాప్–20 మార్కెట్లలో 5జీ కారణంగా కంపెనీల ఆదాయం ఏడు శాతం పెరిగిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా, దాదాపు 240 కమ్యూనికేషన్స్ సర్వీస్ ప్రొవైడర్లు 5జీ సేవలను ప్రారంభించారు. దీనివల్ల వేగవంతమైన మొబైల్ బ్రాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్యాండ్ , ఫిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్ వైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లెస్ యాక్సెస్, గేమింగ్  కొన్ని (ఆగ్మెంటెడ్ రియాలిటీ  వర్చువల్ రియాలిటీ) ఏఆర్​/వీఆర్​-ఆధారిత సేవలు, వీడియోకాలింగ్​ వంటివి అందుబాటులోకి వచ్చాయి.  

నెట్​స్పీడ్​ పెరుగుతోంది...

మనదేశం మొబైల్ ఇంటర్నెట్ వేగంలో ప్రపంచవ్యాప్తంగా మూడు ర్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఎగబాకి ఈ ఏడాది మే నెలలో 56వ స్థానాన్ని పొందింది. అంతకుముందు నెలలో 59వ స్థానంలో ఉందని ఊక్లా స్పీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్ తెలిపింది. దీని ప్రకారం..  మీడియన్​ మొబైల్ డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్ వేగం ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 36.78 ఎంపీబీఎస్​ నుంచి మేలో 39.94 ఎంపీబీఎస్​కి పెరిగింది. ఓక్లా  స్పీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్ ప్రపంచవ్యాప్తంగా మొబైల్  ఫిక్స్​డ్​ బ్రాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్యాండ్ వేగాన్ని నెలవారీగా ర్యాంకుల రూపంలో విడుదల చేస్తుంది.  మీడియన్ ఫిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్ బ్రాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్యాండ్ వేగం విషయంలో మనదేశానికి ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 83వ స్థానం ఉండగా, మేలో 84 కి పడిపోయింది.

అయితే, ఫిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్ మీడియన్ డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్ వేగం ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 51.12 ఎంపీబీఎస్​ నుంచి మే 2023లో 52.53 ఎంపీబీఎస్​కి పెరిగింది. ఈ విషయంలో యూఏఈ మొదటిస్థానంలో ఉండగా, మారిషస్ 11 స్థానాలు పైకి ఎగబాకింది. సింగపూర్ గతంలో మాదిరే నెంబర్​వన్​స్థానంలో ఉంది. బహ్రెయిన్  17 స్థానాలను పెంచుకుంది.