బెంగళూరులో నీట మునిగిన ఇండ్లు, కార్లు

బెంగళూరులో నీట మునిగిన ఇండ్లు, కార్లు
  • 24 గంటల్లో 153 మి.మీ వర్షపాతం
  • నీట మునిగిన ఇండ్లు.. కార్లు
  • సహాయక చర్యల్లో ఎన్డీఆర్‌‌‌‌ఎఫ్‌‌, ఫైర్, ఎమర్జెన్సీ సిబ్బంది  

బెంగళూరు:  నార్త్‌‌ బెంగళూరులో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు సరస్సులు పూర్తిగా నిండటంతో యెలహంక, మహదేవపుర జోన్‌‌లోని అపార్ట్‌‌మెంట్‌‌ బేస్‌‌మెంట్లు, లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లలోకి నీరు చేరిందని అధికారులు తెలిపారు. 24 గంటల్లో సుమారు 153 మిల్లీ మీటర్ల వర్షపాతం రికార్డయ్యిందని చెప్పారు. అల్లలసంద్ర సరస్సు ఉప్పొంగడంతో చుట్టుపక్కల ప్రాంతాలు జలమయమయ్యాయి. నార్త్‌‌ బెంగళూరులోని అతిపెద్ద టెక్ పార్కుల్లో ఒకటైన మాన్యత టెక్ పార్క్‌‌ కూడా నీట మునిగింది. యెలహంకకు దగ్గరలో ఉన్న సరస్సు పొంగడంతో కేంద్రీయ విహార్‌‌‌‌లోకి భారీగా వరద నీరు చేరింది. వరదలో చిక్కుకున్న ప్రజలను ఫైర్, ఎమర్జెన్సీ, ఎన్డీఆర్‌‌‌‌ఎఫ్‌‌ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పలు ప్రాంతాల్లో కార్లు నీట మునిగాయి. ‘‘గ్రౌండ్‌‌ ఫ్లోర్‌‌‌‌ మొత్తం నీట మునిగింది. అక్కడ ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ పాడయ్యాయి. నీళ్లు తగ్గే వరకు ఉండడానికి వేరే చోటు చూసుకోవాలి. నీళ్లు తగ్గిన తరువాత కూడా ఈ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్‌‌‌‌లో నివసించలేం’’ అని కేంద్రీయ విహార్‌‌‌‌లో నివసించే ఒక మహిళ చెప్పారు. ఆక్రమణల కారణంగానే కేంద్రీయ విహార్ మునిగిందని, త్వరలోనే వాటిని తొలగిస్తామని ఆ ప్రాంతంలో పర్యటించిన యెలహంక ఎమ్మెల్యే ఎస్‌‌ఆర్‌‌‌‌ విశ్వనాథ్‌‌ తెలిపారు. ‘‘యెలహంకలో ఆదివారం రాత్రి అత్యధిక వర్షపాతం రికార్డయ్యింది. రెండు గంటల్లో సుమారు 138 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. చాలా ప్రాంతాల్లో వరద తగ్గింది. అయితే కేంద్రీయ విహార్‌‌‌‌లో నీరు తగ్గడానికి రెండు మూడు రోజుల సమయం పడుతుంది. ఈ ఏరియాలో ఎనిమిది ఫ్లోర్ల బిల్డింగ్‌‌లు ఎనిమిది వరకు ఉన్నాయి. అపార్ట్‌‌మెంట్లలోని సెల్లార్లలో 5 అడుగుల వరకు నీరు చేరింది. వాటిలో ఉండేవాళ్లెవరూ బయటికి రావడానికి చాన్స్ లేదు. కరెంట్‌‌ కట్‌‌ చేశాం. ఫుడ్, వాటర్‌‌‌‌ సహా నిత్యావసరాలను అందిస్తున్నాం’’ అని విశ్వనాథ్‌‌ పేర్కొన్నారు. 

చెన్నైలో పడవలతో సహాయక చర్యలు
తమిళనాడు రాష్ట్రం నార్త్‌‌ చెన్నైకు దగ్గరలోని మనాలిలో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. పలు ఇండ్లలోకి నీరు చేరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కోసస్తలైయార్‌‌‌‌ నది ఉప్పొంగడంతో నార్త్‌‌ చెన్నైలోని అనేక ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. అండర్‌‌‌‌పాస్‌‌లోని నీటిలో మునిగిన కార్లను బయటికి తీయడానికి ప్రయత్నిస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. నార్త్ చెన్నైలోని పలు ప్రాంతాల్లో పడవలను ఉపయోగించి సహాయ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.