ఇండోనేషియాలో నాట్కో సబ్సిడరీ

ఇండోనేషియాలో నాట్కో సబ్సిడరీ

హైదరాబాద్​, వెలుగు: ఇండోనేషియాలో కొత్తగా సబ్సిడరీ పెట్టేందుకు నాట్కో ఫార్మా లిమిటెడ్​ బోర్డు ఆమోదం తెలిపింది. ఆ దేశంలో  ఫార్మాస్యూటికల్​ప్రొడక్ట్స్​ అమ్మేందుకు రూ. 25 కోట్లతో ఈ సబ్సిడరీ పెడుతున్నారు. కొత్త సబ్సిడరీకి పీటీ నాట్కో లోటస్​ఫార్మా పేరు పెట్టారు. సబ్సిడరీ కంపెనీలో నాట్కోకు 51 శాతం వాటా, పీటీ మిత్ర మెడిస్​ ఎగ్జిమ్​కి 49 శాతం వాటా ఉంటాయి. ఇండోనేషియాలో పేరొందిన మిత్ర జయ గ్రూప్​తో కలిసి జాయింట్​ వెంచర్​గా సబ్సిడరీ ఏర్పాటు చేస్తున్నట్లు నాట్కో ఫార్మా లిమిటెడ్​ వెల్లడించింది.

మొదటిదశలో ఒక  మిలియన్​ డాలర్లు వెచ్చించనున్నామని, ఆ తర్వాత అవసరమైనప్పుడు మిగిలిన డబ్బు పెట్టుబడిగా పెట్టనున్నామని పేర్కొంది. మిత్ర జయ గ్రూప్​ కంపెనీ అయిన మిత్ర మెడిస్​ ఎగ్జిమ్​ చాలా ఏళ్లుగా యాక్టివ్​ ఫార్మాస్యూటికల్​ ఇన్​గ్రీడియెంట్స్​ (ఏపీఐ) అమ్ముతోంది. గ్రోత్​తోపాటు, లాభదాయకత పెంచుకోవడానికి కొత్త దేశాలలో ఎంటరవుతున్నామని నాట్కో ఫార్మా ఈ సందర్భంగా తెలిపింది.