యూట్యూబ్‌‌లో ఆడిండు... లైఫ్​లో గెలిచిండు

యూట్యూబ్‌‌లో ఆడిండు... లైఫ్​లో గెలిచిండు

చూస్తే ఇరవై ఏండ్ల కుర్రాడు.. కానీ.. దేశవ్యాప్తంగా కోట్ల మంది ఫ్యాన్స్‌‌ని సంపాదించుకున్నాడు. పైగా కోట్ల రూపాయలు సంపాదించాడు. పేరు ఉజ్వల్‌‌ చౌరాసియా. కానీ.. అందరికీ ‘టెక్నో గేమర్జ్‌‌’‌‌గానే తెలుసు. ఇది అతను నడిపే యూట్యూబ్ ఛానెల్‌‌ పేరు. అతనికి ఉన్న ఫాలోయింగ్ అంతా ఈ గేమింగ్‌‌ ఛానెల్‌‌ వల్లే వచ్చింది. యూట్యూబ్​లో ఉజ్వల్ చౌరాసియా వీడియోలకు భలే క్రేజ్‌‌ ఉంది. కొన్ని కోట్ల మంది అతని వీడియోలు చూస్తుంటారు. జనవరి12, 2002న ఢిల్లీలో పుట్టాడు. ఇండియాలో తక్కువ వయసులో గేమింగ్‌‌ కంటెంట్‌‌ క్రియేటర్లుగా ఎదిగిన వాళ్లలో ఉజ్వల్‌‌ ముందు వరుసలో ఉంటాడు. తన15వ ఏట అంటే 2017లో యూట్యూబ్‌‌ రంగం లోకి అడుగు పెట్టాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు వెనక్కి తిరిగి చూసుకోలేదు. చేసే వీడియోలతో పాటు ఫాలోయింగ్ కూడా పెరుగుతూ పోతోంది. ఉజ్వల్ ఎక్కువగా జీటీఏ 5, మైన్‌‌క్రాఫ్ట్‌‌ లాంటి గేమ్స్‌‌ ఆడుతుంటాడు. వాటితోనే కంటెంట్‌‌ క్రియేట్ చేస్తుంటాడు.  

చిన్నప్పటి నుంచే..

ఉజ్వల్  చిన్నప్పటి నుంచే గేమ్స్‌‌ ఆడుతుండేవాడు. పదో తరగతి చదువుతున్నప్పుడు తన అన్నయ్య సలహాతో ఒక ఛానెల్‌‌ పెట్టాడు. తర్వాత, గేమింగ్‌‌ కంటెంట్‌‌ క్రియేటర్స్‌‌ చేస్తున్న వీడియోలు చూసి చాలా విషయాలు నేర్చుకున్నాడు. అప్పట్లో అతని దగ్గర కనీసం ఫోన్ కూడా లేదు. అన్న ఫోన్‌‌లోనే గేమ్స్ ఆడేవాడు. సొంతంగా కంటెంట్‌‌ క్రియేట్‌‌ చేయడం మొదలుపెట్టినప్పుడు తన దగ్గర పెద్దగా ఎక్విప్‌‌మెంట్‌‌ కూడా లేదు. ఇంట్లో అందుబాటులో ఉండే ఎక్విప్‌‌మెంట్స్‌‌నే మార్చుకుని వాడాడు. అయితే.. కంటెంట్‌‌ క్రియేట్‌‌ చేయడం మొదలుపెట్టిన కొన్ని రోజులకు అతను చేసిన ఒక వీడియో బాగా వైరల్ అయింది. దానికి చాలా వ్యూస్‌‌ వచ్చాయి. అప్పటి నుంచి అతను చేసిన ప్రతి వీడియోను కొన్ని లక్షల మంది చూడడం మొదలైంది. ఇక అతను జీటీఏ సిరీస్ చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి సబ్‌‌స్క్రయిబర్స్‌‌ సంఖ్య చాలా స్పీడ్‌‌గా పెరిగింది. 

సబ్‌‌స్క్రయిబర్స్‌‌ డిమాండ్‌‌

కంటెంట్ ఎంచుకోవడంలో ఉజ్వల్ చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. సబ్‌‌స్క్రయిబర్స్‌‌ ఎలాంటి కంటెంట్‌‌ కోరుకుంటున్నారో తెలుసుకుని అలాంటి కంటెంట్‌‌నే క్రియేట్‌‌ చేస్తాడు. వీడియో చేసేముందు “ఈ కంటెంట్‌‌కు మార్కెట్‌‌లో డిమాండ్  ఉందా? లేదా?” అని ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాడు. అలాగని అతను ట్రెండ్‌‌ని ఫాలో అవ్వడు. ‘‘సబ్‌‌స్క్రయిబర్స్ డిమాండ్‌‌ నాకు ముఖ్యం’’ అంటాడు. అందుకే కంటెంట్‌‌ క్రియేట్‌‌ చేసేముందు సబ్‌‌స్క్రయిబర్స్ అభిప్రాయాలు తీసుకుంటాడు. వీడియోలో మొదటి నిమిషం చాలా ఇంట్రెస్టింగ్‌‌ ఉండే కంటెంట్‌‌ పెడతాడు. ఎందుకంటే.. వ్యూయర్‌‌‌‌ వీడియోని చూసేటట్టు చేయాలంటే ఆ ఒక్క నిమిషమే చాలా కీలకం అంటాడు ఉజ్వల్‌‌. 

మూడు ఛానెళ్లు

ఉజ్వల్ ప్రస్తుతం మూడు ఛానెళ్లు నడుపుతున్నాడు. అతని మెయిన్‌‌ఛానెల్‌‌  ‘‘టెన్నో గేమర్జ్‌‌’’ని  27 మిలియన్ల మంది సబ్‌‌స్క్రయిబ్‌‌ చేసుకున్నారు. ఈ ఛానెల్‌‌ని ఆగస్టు 13, 2017లో మొదలుపెట్టాడు. ఆ తర్వాత 2018 జనవరిలో ‘ఉజ్వల్’ పేరుతో మరో ఛానెల్‌‌ పెట్టాడు. దీనికి 7.72 మిలియన్ల సబ్‌‌స్క్రయిబర్స్‌‌ ఉన్నారు. ఇందులో గేమింగ్ ప్రొడక్ట్స్‌‌ అన్‌‌బాక్సింగ్‌‌ వీడియోలు కూడా చేస్తున్నాడు. అంతేకాదు మూడు.. నాలుగ్గంటలు ఉండే పెద్ద వీడియోలు కూడా ఇందులో అప్‌‌లోడ్ చేస్తుంటాడు. ఇప్పుడు షార్ట్‌‌ వీడియోల ట్రెండ్ బాగా పెరగడంతో యూట్యూబ్‌‌ షార్ట్స్‌‌ అప్‌‌లోడ్‌‌ చేసేందుకు 2021 నవంబర్‌‌‌‌లో ‘‘ఉజ్వల్‌‌ షార్ట్స్‌‌ పేరుతో మరో ఛానెల్‌‌ కూడా పెట్టాడు. దీనికి ప్రస్తుతం 2.3 మిలియన్ల సబ్‌‌స్క్రయిబర్స్‌‌ ఉన్నారు. 

నెట్‌‌ వర్త్‌‌ 

ఈ మూడు ఛానెళ్ల ద్వారా ఉజ్వల్​కి ఆదాయం కూడా బాగానే వస్తోంది. బాగానే అంటే... చిన్న వయసులోనే నెలకు దాదాపు 20 లక్షల రూపాయల వరకు సంపాదించేంత. ఇప్పటివరకు యూట్యూబ్‌‌, ప్రమోషన్స్‌‌ ద్వారా దాదాపు 3.5 కోట్ల రూపాయలు పైగా సంపాదించాడు.