ఇలాంటి పిరికిపందలు మమ్మల్ని భయపెట్టలేరు: ఒవైసీ

ఇలాంటి పిరికిపందలు మమ్మల్ని భయపెట్టలేరు: ఒవైసీ

ఢిల్లీ జామియా ఏరియాలో సీఏఏ వ్యతిరేక నిరసనకారులపై ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులు జరపడంపై స్పందించారు ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. ఇలాంటి పిరికిపంద చర్యలు తమను భయపెట్టలేవంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతాయంటూ ట్వీట్ చేశారు.

గురువారం మధ్యాహ్నం  ఢిల్లీలో జామియా కోఆర్డినేషన్ కమిటీ చేపట్టిన నిరసనలపై యూపీకి చెందిన ఓ వ్యక్తి.. ‘ఆజాదీ కావాలా? తీసుకోండి’ అంటూ  కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ విద్యార్థికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై స్పందించిన అసదుద్దీన్ ఒవైసీ.. కాల్పులు జరిపిన యువకుడిని గాడ్సేతో పోల్చారు. ఉగ్రవాది గాడ్సే చేసిన మహాత్ముడి హత్యోదంతాన్ని తలుచుకుంటున్న ఈ రోజునే (గాందీజీ 72వ వర్థంతి) మరో ఘటన జరిగిందన్నారు. సీఏఏకి వ్యతిరేకంగా విద్యార్థులు తమ నిరసనలు తెలుపుతూ రాజ్ ఘాట్ (గాంధీజీ సమాధి) వద్దకు వెళ్తున్న సమయంలో దాడి చేయడం పిరికిపంద చర్య అన్నారు. ఇలాంటి పిరికిపందలు తమను భయపెట్టలేరని చెప్పారు. సీఏఏకి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతూనే ఉంటాయని స్పష్టం చేశారాయన. దేశంలో ప్రస్తుతం గాడ్సే ఇండియా వర్సెస్ గాందీ, నెహ్రూ, అంబేద్కర్ల ఇండియా నడుస్తోందని, ఏ సైడ్ తీసుకోవాలన్నది చాలా ఈజీ అని చెప్పారు అసదుద్దీన్.