భద్రాచలం, వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో సోమవారం సుదర్శన హోమం భక్తిప్రపత్తులతో నిర్వహించారు. ప్రతినెలా చిత్తా నక్షత్రం రోజున సుదర్శన పెరుమాళ్ కు సుదర్శన హోమం నిర్వహించడం సంప్రదాయం. ఇందులో భాగంగా సీతారామచంద్రస్వామి, సుదర్శన స్వామి వారిని మేళతాళాలతో యాగశాలకు తీసుకొచ్చారు. ప్రత్యేక అలంకరణ చేసి ఈ క్రమంలో ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, సుదర్శన కలశ స్థాపన, హవనం, పూర్ణాహుతి, ఆశీర్వచనం నిర్వహించారు.
ఈ సందర్భంగా సుదర్శన స్వామికి ప్రసాదం నివేదిన చేసి భక్తులకు పంపిణీ చేశారు. ఇదిలా ఉండగా ఉదయం గర్భగుడిలో మూలవరులకు సుప్రభాత సేవ అనంతరం ముత్తంగి సేవ జరిగింది. ముత్యాలు పొదిగిన వస్త్రాలను అలంకరించి విశేష హారతులు సమర్పించారు. లక్ష్మీతాయారు అమ్మవారు, ఆంజనేయస్వామిలతో పాటు ఉత్సవమూర్తులు, సుదర్శనమూర్తికి కూడా ముత్తంగి సేవ ఘనంగా చేశారు. కల్యాణమూర్తులను బేడా మండపంలోకి తీసుకెళ్లి నిత్య కల్యాణం చేశారు.
భక్తులు కంకణాలు ధరించి క్రతువు నిర్వహించారు. సాయంత్రం దర్భారు సేవ జరిగింది. ఖమ్మంలోని జయనగర్కాలనీకు చెందిన శ్రీరంగం వకుళ భాష్యం అనే భక్తుడు జానకీసదనంలో గది నిర్మాణం నిమిత్తం రూ.12లక్షలను విరాళంగా ఏఈవో శ్రావణ్‌కుమార్‌కు అందజేశారు. ముక్కోటి ఉత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. గోదావరిలో తీరంలో ఈనెల 29న జరిగే తెప్పోత్సవానికి నదిలో నిర్మించే చెక్క ర్యాంపు కోసం పుష్కరఘాట్‌లో దేవస్థానం, ఇరిగేషన్ ఇంజనీర్లు సర్వే నిర్వహించారు.
