గ్రేట్ డైరెక్టర్ కావాలనుకునే అబ్బాయి. కథ రాసుకుంటాడు. దానికి ప్రాణం పోయగల హీరోయిన్ కోసం వెతుకుతుంటాడు. అంతలో ఓ డాక్టర్ కనిపిస్తుంది. తన సినిమాకి ఆమే పర్ఫెక్ట్ అనిపిస్తుంది. తనని ఒప్పిస్తాడు. సెట్స్‌కి రప్పిస్తాడు. ఇద్దరూ కలిసి వర్క్ చేస్తుంటారు. ఒకరిపై ఒకరు ఇష్టమూ పెంచుకుంటారు. కానీ సినిమాలంటే పడని ఆ అమ్మాయి ఫ్యామిలీ అడ్డు పడుతుంది. నటించడానికి వీల్లేదంటూ రిస్ట్రిక్ట్ చేస్తుంది. దాంతో ఆమె ఇక కెమెరా ముందుకు రాలేనని చెబుతుంది.
సినిమాయే ఊపిరిగా బతుకుతున్న ఆ అబ్బాయి కలల ప్రపంచం ఒక్కసారిగా కుప్పకూలినట్టవుతుంది. అప్పుడు తనేం చేస్తాడు? వాళ్లని ఒప్పిస్తాడా? తనని తిరిగి తీసుకొస్తాడా? తెలియాలంటే ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమా చూడాలి. సుధీర్ బాబు, కృతీశెట్టి జంటగా ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 16న విడుదల కానుంది. నిన్న మహేష్‌బాబు ట్రైలర్‌ని లాంచ్ చేశాడు. సరదాగా మొదలైన ఈ ట్రైలర్ ఆ తర్వాత సీరియస్‌గా మారి, చివరికి ఎమోషనల్‌గా ఎండ్ అయ్యింది. సుధీర్ డైలాగ్స్, కృతి క్యారెక్టరయిజేషన్, వెన్నెల కిశోర్ కామెడీ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ని పెంచాయి. మొత్తంగా ఆ అమ్మాయి కథని ట్రైలర్ ద్వారా చెప్పకనే చెప్పారు. ఇదో మంచి ఎంటర్టైనర్ అనే నమ్మకాన్ని కలిగించారు.
