షుగర్ హెచ్చు తగ్గులతో.. మానసిక ఆందోళన పెరుగుతుందా!.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

షుగర్ హెచ్చు తగ్గులతో.. మానసిక ఆందోళన పెరుగుతుందా!.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

మధుమేహం (డయాబెటిస్) అంటే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం మాత్రమే కాదు. ప్రతిరోజూ మందులు వేసుకోవడం, ఆహార నియమాలు పాటించడం, షుగర్ లెవల్స్‌ను పరీక్షించుకోవడంతో పాటు భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు వస్తాయేమోననే భయం కూడా చాలామందిని వేధిస్తుంది. ఈ ఆందోళన క్రమంగా మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తుందంటున్నారు డాక్టర్లు.

షుగర్ లెవల్స్‌తో మూడ్ మార్పులు!

రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినా, తగ్గినా శరీరంతో పాటు మనసుపైనా ప్రభావం పడవచ్చు. షుగర్ లెవల్స్ తగ్గినప్పుడు కొందరిలో చిరాకు, ఆందోళన, గుండె వేగంగా కొట్టుకోవడం, గందరగోళం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు అలసట, నీరసం, ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు ఎదురుకావచ్చంటున్నారు చెన్నైకి చెందిన సీనియర్ కన్సల్టెంట్ డయాబెటాలజిస్ట్ ,జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ఉత్రా. అయితే, ప్రతి మూడ్ మార్పునకు డయాబెటిస్‌నే కారణంగా భావించకూడదంటున్నారు. ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఇందుకు కారణం కావచ్చంటున్నారు. 

భవిష్యత్తు సమస్యల భయం

డయాబెటిస్ ఉన్నవారిలో కంటి చూపు తగ్గడం, కిడ్నీ సమస్యలు, గుండె జబ్బులు వస్తాయేమోననే భయం ఉంటుంది. ప్రతిరోజూ షుగర్ పరీక్షించుకోవడం, ఆహార నియమాలు పాటించడం కొన్నిసార్లు మానసిక భారంగా మారుతుంది. దీనిని 'డయాబెటిస్ డిస్ట్రెస్' అంటారు. ఇది డయాబెటిస్ నిర్వహణలో ఎదురయ్యే ఒత్తిడి, నిరాశకు సంబంధించినది.

ఈ ఆందోళన వల్ల నిద్ర సరిగా పట్టకపోవడం, కుటుంబ సభ్యులతో చిరాకుగా మాట్లాడటం, ఇష్టమైన పనులకు దూరంగా ఉండటం వంటి మార్పులు కనిపించవచ్చు. సమస్యలు ఎక్కువకాలం కొనసాగితే డిప్రెషన్, ఆందోళన సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది.

మానసిక ప్రశాంతత కోసం ఏం చేయాలి?

వైద్యులు సూచించిన మందులను క్రమం తప్పకుండా వాడాలి. సమయానికి భోజనం చేస్తూ, తగిన వ్యాయామం చేయాలి. షుగర్ రీడింగ్‌ల గురించి అతిగా ఆందోళన చెందకుండా వైద్యుల సలహా తీసుకోవాలి. తగినంత నిద్రపోవాలి. ధ్యానం, నెమ్మదిగా శ్వాస తీసుకునే వ్యాయామాలు పాటించవచ్చు. ఆందోళన ఎక్కువగా ఉంటే కుటుంబ సభ్యులతో లేదా మానసిక ఆరోగ్య నిపుణులతో మాట్లాడాలి.

డయాబెటిస్ నియంత్రణలో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమే. షుగర్ స్థాయిలను నియంత్రించుకుంటూ, ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తే మెరుగైన జీవనాన్ని గడపవచ్చంటున్నారు డాక్టర్లు.