షుగర్ ఫ్రీ రైస్ గా తెలంగాణ సోనా బియ్యం

షుగర్ ఫ్రీ రైస్ గా తెలంగాణ సోనా బియ్యం

హైదరాబాద్, వెలుగు: అన్నం తింటే బ్లడ్ లో షుగర్ లెవెల్స్  పెరుగుతాయి.తినకుంటే ఏదో వెలితి. డయాబెటిస్ వల్ల ఆహార అలవాట్లు మార్చుకునే వారికి ఇదో అవస్థ. అన్ని రకాల సన్న బియ్యంతోనూ ఇదే సమస్య. తెలంగాణ సోనా రకంతో ఈ ఇబ్బంది ఉండదని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ చెబుతోంది. ఈ రకం బియ్యం తిన్న తర్వాత బ్లడ్ లో గ్లూకోజ్  లెవెల్స్ పెరగడంలేదని, గ్లైసెమిక్  ఇండెక్స్ కూడా తక్కువే ఉంటోందని చెప్పింది. అయితే డాక్టర్లు దీన్ని కన్ఫర్మ్  చేయాల్సి ఉందంటోంది. షుగర్ ఫ్రీ రైస్ గా పేరు తెచ్చుకున్న ఈ రకం బియ్యానికి డిమాండ్ పెరుగుతోందని, దీని సాగు కూడా వేగంగా విస్తరిస్తోందని వర్సిటీ ప్రొఫెసర్లు చెబుతున్నారు.

పెరుగుతున్న సాగు విస్తీర్ణం

తెలంగాణ సోనా(ఆర్ఎన్ఆర్ 15048) ఇప్పుడు సన్న బియ్యం రకాల్లో కొత్త ట్రెండ్ సృష్టిస్తోంది. షుగర్ ఫ్రీ రైస్ బ్రాండ్ గా మారడం, మిగతా సన్న రకం విత్తనాలతో పోల్చితే పెట్టుబడి ఖర్చు తగ్గడం, తక్కువ రోజుల పంట కావడంతో విస్తీర్ణం పెరుగుతోంది. మూడేండ్ల క్రితం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలకే పరిమితమైన తెలంగాణ సోనా సాగు.. ఇప్పుడు ఎనిమిది రాష్ట్రాలకు విస్తరించింది. తెలంగాణ సోనా వానాకాలంలో, యాసంగిలోనూ సాగుకు అనుకూలం. తెలంగాణలో వరి సాగు విస్తీర్ణం వానకాలంలో 40 లక్షల ఎకరాలు, యాసంగిలో 40 లక్షల ఎకరాలు ఉంటోంది. ప్రస్తుత ఏడాదిలో 8 లక్షల ఎకరాల్లో తెలంగాణ సోనా సాగైంది. వచ్చే ఏడాది ఒక్క వానాకాలంలోనే 10 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఎన్నో ప్రత్యేకతలు

సన్న రకం వడ్లను మిల్లింగ్ చేస్తే నార్మల్ గా 50 నుంచి 60 కిలోల బియ్యమే వస్తాయి. నూకల శాతం ఎక్కువగా ఉంటుంది. తెలంగాణ సోనా రకమైతే 68 నుంచి 70 కిలోల వరకు బియ్యం వస్తాయి. బీపీటీ 5204 రకంలో గ్లైసెమిక్  ఇండెక్స్ 56.50 శాతం ఉంటే.. తెలంగాణ సోనాలో ఇది 51 శాతమే. అన్నం క్వాలిటీని తెలిపే గంజి శాతం(అమైలోజ్)  కూడా తెలంగాణ సోనాలో 20.72 శాతం ఉంటే.. మిగిలిన సన్న రకాల బియ్యంలో 27 శాతం వరకు ఉంటుంది. సాధారణ రకంలో ప్రొటీన్ 7–8 శాతం ఉంటే.. తెలంగాణ సోనాలో 8.76 శాతం ఉంది.

రైతులకు లాభం

40 ఏళ్ల క్రితం అందుబాటులోకి వచ్చిన బీపీటీ 5204(విజయమసూరి, సోనా మసూరి, సాంబ మసూరి) రకం సన్న బియ్యానకే  ఇప్పటికీ డిమాండ్ ఉంది. ఈ రకానికి అగ్గి తెగులు, పొట్ట కుళ్లు తెగులు సోకుతుండడం వల్ల రైతులకు నష్టం కలుగుతోంది. వీటి నుంచి పంటను రక్షించేందుకు పురుగు మందు కొట్టాలి. బీపీటీతో పోల్చితే తెలంగాణ సోనా రకం 20 రోజులు తక్కువ పంట కావడం వల్ల ఫెర్టిలైజర్ వాడకం తక్కువ. తెలంగాణ సోనా రకం 125 రోజుల్లోనే చేతికొస్తుంది. ఈ లెక్కన.. సగటున 5 లక్షల ఎకరాల్లో తెలంగాణ సోనా వేయడం వల్ల 11 టీఎంసీల నీరు అదా అవుతుంది.

రైతులకు మేలు చేసే రకం

ఎప్పటికప్పుడు రైతుల అవసరాలను, ప్రజల ఆహార అవసరాలను తీర్చడం లక్ష్యంగా మా వర్సిటీ కృషి చేస్తోంది. తెలంగాణ సోనా రైతులకు ఎంతో మేలు చేసే రకం. అందుకే సాగు విస్తీర్ణం పెరుగుతోంది. వానకాలం, యాసంగి సీజన్లలోనూ వేయవచ్చు. ఎకరానికి 28 క్వింటాళ్ల వరకు పంట పండుతుంది. రైతులకు పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది. నీటి వనరులు ఆదా అవుతాయి.

– డాక్టర్ వి.ప్రవీణ్ రావు, వీసీ, ప్రొ.జయశంకర్  స్టేట్  అగ్రికల్చరల్  వర్సిటీ