పంట పైసలు రాక ..  చెరుకు రైతులు పరేషాన్

పంట పైసలు రాక ..  చెరుకు రైతులు పరేషాన్

సంగారెడ్డి/జహీరాబాద్, వెలుగు : అమ్మిన పంటకు సంబంధించిన బిల్లులు రాక చెరుకు రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పైసల కోసం షుగ ర్​ ఫ్యాక్టరీ చుట్టూ తిరుగుతున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని కొత్తూర్(బి) వద్ద నెలకొల్పిన ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం తీరు మారడం లేదు. ఏటా బిల్లుల చెల్లింపు విష యంలో తీవ్ర జాప్యం చేస్తోంది. జహీరాబాద్ పరిసర ప్రాంతాల్లో చెరుకు పంటకు అనువైన నేలలు ఉన్నా యి. దీంతో దాదాపు రైతులంతా చెరుకు సాగుకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే కష్టపడి పండించి, పంటను ఫ్యాక్టరీకి తరలించిన రైతులకు పూర్తిస్థాయిలో పైసలు ఇవ్వకుండా ట్రైడెంట్ షుగర్​ఫ్యాక్టరీ యాజమాన్యం వేధిస్తోంది. సీజన్ ముగిసి 3 నెలలవుతున్నా ఇంతవరకు రైతులకు బాకీ పడిన రూ.13 కోట్లు చెల్లించడం లేదు. ప్రస్తుతం ఫ్యాక్టరీ క్లోజ్​చేసి ఉంది. దీంతో చెరుకు రైతులు ఆందోళన చెందుతున్నారు.

3 లక్షల టన్నుల చెరుకు

ఈ సీజన్ లో ట్రైడెంట్ ఫ్యాక్టరీలో 3 లక్షల టన్నుల చెరుకును క్రషింగ్ చేశారు. టన్నుకు రూ.3,270 చొప్పున ధర నిర్ణయించగా, ఇప్పటివరకు రైతులకు రూ.69 కోట్ల బిల్లులు చెల్లించారు. అయితే టన్నుకు రూ.3 వేలు మాత్రమే చెల్లించి మిగతా రూ.270 ఆపారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇంకా రూ.13 కోట్లు చెల్లించాల్సి ఉందని వాపోతున్నారు. అధికారులు స్పందించి బాకీ పడిన మొత్తం ఇప్పించాలని కోరుతున్నారు. జహీరాబాద్, జరాసంఘం, మొగుడంపల్లి, కోహీర్, న్యాల్కల్ మండలాల్లో దశాబ్దాలుగా చెరుకును సాగుచేస్తున్నారు. మార్కెట్ లో చక్కెర ధర పెరిగినప్పటికీ ఫ్యాక్టరీ యాజమాన్యం చెరుకు మద్దతు ధరను పెంచడం లేదని రైతులు మండిపడుతున్నారు.

ఫ్యాక్టరీ, అధికారుల  చుట్టూ తిరుగుతున్న

చెరుకు బిల్లులు ఇవ్వకుండా ట్రైడెంట్ ఫ్యాక్టరీ రైతులను ఇబ్బంది పెడుతోంది. ఈ సీజన్ లో దాదాపు 300 టన్నుల చెరుకును ఫ్యాక్టరీకి తరలించాను. టన్నుకు రూ.270 చొప్పున ఇంకా లక్ష రూపాయలు రావాల్సి ఉంది. ఫ్యాక్టరీ, అధికారుల చుట్టూ తిరుగుతున్నాను. నాలాగే వేల మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు స్పందించి బకాయిలు ఇప్పించాలి.
-  మల్లయ్య, చెరుకు రైతు,కొత్తూరు

త్వరలోనే బిల్లులు ఇప్పిస్తాం

చెరుకు రైతులు అధైర్యపడొద్దు. ఫ్యాక్టరీ అధికారులు, యాజమాన్యంతో ఇప్పటికే మాట్లాడాను. బిల్లుల విషయమై చర్చించాను. సమస్యను ప్రభుత్వం, జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లాను. త్వరలోనే బిల్లులు వస్తాయి.
-  రాజశేఖర్, కేన్ అసిస్టెంట్ కమిషనర్