ఫేస్‌‌బుక్‌‌ లైవ్‌‌ పెట్టి యువకుడి ఆత్మహత్యాయత్నం

ఫేస్‌‌బుక్‌‌ లైవ్‌‌ పెట్టి యువకుడి ఆత్మహత్యాయత్నం
  • రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘటన

తంగళ్లపల్లి, వెలుగు: ఓ యువకుడు ఫేస్​బుక్​లైవ్​పెట్టి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం సోమవారం సిరిసిల్ల జిల్లాలో సంచలనం సృష్టించింది. ఫేస్​బుక్​లైవ్​వీడియో ప్రకారం.. తంగళ్లపల్లి మండలం బస్వాపూర్‌‌కు చెందిన గొడిసెల దిలీప్(23), చింతలఠాణా గ్రామానికి చెందిన యువతి ప్రేమించుకున్నారు. యువతి అనారోగ్యానికి గురైనప్పుడు దిలీప్ ​రూ.3లక్షల వరకు ఖర్చు చేశాడు. తర్వాత యువతి తల్లిని కలిసి ప్రేమ విషయం చెప్పాడు. ​కులం ఏమిటో అడిగిన యువతి తల్లి దిలీప్​ను కులం పేరుతో దూషించింది. తర్వాత యువతి కుటుంబ సభ్యులు, చింతలఠాణాకు చెందిన కొందరు పెద్ద మనుషులు దిలీప్​పై సిరిసిల్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సిరిసిల్ల సర్కిల్ ఇన్‌‌స్పెక్టర్ అనిల్.. ​దిలీప్ ​ఇంటికి వెళ్లి యువకుడి మొబైల్‌‌లో యువతితో కలిసి దిగిన ఫొటోలను డిలీట్​చేయించారు. తర్వాత దిలీప్​పై కేసు ఫైల్ ​చేసి అరెస్టు చేశారు. బెయిల్​పై బయటికి వచ్చిన దిలీప్​ సోమవారం ఫేస్​బుక్​లైవ్​ పెట్టి తనపై తప్పుడు కేసులు పెట్టి రౌడీ షీట్ ఓపెన్​ చేస్తామని బెదిరిస్తున్నారని వాపోయాడు. సీఐ అనిల్ కుమార్ వేధింపులతోపాటు తనపై తప్పుడు కేసులు పెట్టించిన వారి కారణంగానే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానని పురుగుల మందు తాగాడు. గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే సిరిసిల్ల తరలించారు. ఈ ఘటనపై సీఐ అనిల్​ కుమార్​ను వివరణ కోరగా యువతి, ఆమె కుటుంబ సభ్యులతో దిలీప్​ దురుసుగా ప్రవర్తించాడని ఫిర్యాదు అందడంతో కేసు ఫైల్​చేశామని చెప్పారు. అతన్ని కొట్టడం కానీ తిట్టడం కానీ చేయలేదని వివరించారు. దిలీప్​ను స్టేషన్​కు రమ్మని ఫోన్ చేయగా ఇష్టమొచ్చినట్లు మాట్లాడాడని సీఐ తెలిపారు.