అనురాగ్ వర్సిటీలో స్టూడెంట్ ఆత్మహత్యాయత్నం

అనురాగ్ వర్సిటీలో స్టూడెంట్ ఆత్మహత్యాయత్నం
  • సెకండ్ ఫ్లోర్ నుంచి దూకడంతో తీవ్ర గాయాలు
  • మేనేజ్​మెంట్​ వేధింపులే కారణమన్న విద్యార్థి తండ్రి!

ఘట్ కేసర్, వెలుగు: సెమిస్టర్ మార్కుల విషయంలో  కాలేజీ మేనేజ్​మెంట్ వేధింపులు తట్టుకోలేక ఓ స్టూడెంట్  బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ మండలం వెంకటాపూర్ లోని అనురాగ్ వర్సిటీలో బుధవారం సాయంత్రం జరిగింది. గాయపడ్డ స్టూడెంట్.. ప్రస్తుతం ఆస్పత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ గ్రామానికి చెందిన జ్ఞానేశ్వర్ రెడ్డి(18) అనురాగ్ వర్సిటీలో ఇంజినీరింగ్(సీఎస్ఈ) ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఇటీవల ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వెలువడగా, 4 సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడు. అప్పటి నుంచి తమ కొడుకుని డీన్ శ్రీనివాస్ రావు హేళన చేస్తూ వేధిస్తున్నాడని జ్ఞానేశ్వర్ రెడ్డి తండ్రి నక్కిరెడ్డి తిరుపతి రెడ్డి ఆరోపించారు. మార్కుల విషయంలో అందరి ముందు నిలబెట్టి కొట్టి అవమానించినట్లు జ్ఞానేశ్వర్ తమకు మంగళవారం ఫోన్ చేసి చెప్పినట్లు వివరించారు. వర్సిటీకి వచ్చి యజమాన్యంతో మాట్లాడుతామని చెప్పి సముదాయించామని చెప్పారు. బుధవారం ఉదయం కూడా క్లాస్ లో మళ్లీ అవమానించారని..దాంతో వర్సిటీ సీ బ్లాక్ 2వ అంతస్తుపై నుంచి దూకి జ్ఞానేశ్వర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు చెప్పారు. కాలేజీ డీన్ శ్రీనివాస్ రావు, మేనేజ్​మెంట్​పై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని తిరుపతి రెడ్డి డిమాండ్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు..దర్యాప్తు ప్రారంభించారు.