బ్రహ్మోస్ – సుఖోయ్ : పవర్‌ఫుల్‌ జోడీ

బ్రహ్మోస్ – సుఖోయ్ : పవర్‌ఫుల్‌ జోడీ

బ్రహ్మోస్–సుఖోయ్‌‌.. ఈ రెండూ కలిస్తే బాలాకోట్ లాంటి ఆపరేషన్లు ఇండియా నుంచే చేయొచ్చు. బోర్డర్‌‌కు150 కిలోమీటర్ల దూరం నుంచి బ్రహ్మోస్‌‌ను వదిలితే చాలు.. 60 సెకన్లలో అంతా పూర్తయిపోతుంది. ఇప్పుడున్న బ్రహ్మోస్‌‌కే ఇంత శక్తి ఉందనుకుంటే, కొత్త వెర్షన్ బ్రహ్మోస్–ఏ పాకిస్థాన్‌‌లోని బహావల్ పూర్ లో ఉన్న జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ ప్రధాన బిల్డింగ్‌‌ను కూల్చేయగలదు. మామూలు బ్రహ్మోస్ మిస్సైల్స్ రేంజ్ 300 నుంచి 400 కిలోమీటర్లు. బ్రహ్మోస్ ఏ వెర్షన్ రేంజ్ 650 కిలోమీటర్లు. ప్రస్తుతం ఇది అభివృద్ధి దశలో ఉంది.  ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్రహ్మోస్ మిస్సైల్స్‌‌ను సుఖోయ్ ఫైటర్లకు జత చేసే స్పీడ్ ను పెంచింది.

ఇది పూర్తయితే పాకిస్థాన్ కీలక స్థావరాలన్నింటిపైనా దాడి చేయగల సామర్థ్యాన్ని మన వాయుదళం అందుకుంటుంది. బ్రహ్మోస్‌‌–ఏ ఎయిర్ ఫోర్స్ చేతికి వస్తే, అరేబియా సముద్రం నుంచీ పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ స్థావరాలను నాశనం చేయొచ్చు. దీనికి అణుబాంబులనూ  అమర్చొచ్చు. బ్రహ్మోస్ ను అడ్డుకునే సామర్థ్యం పాకిస్థాన్‌‌కు దాదాపుగా లేదు. 2020–-21 నాటికి రెండు స్క్వాడ్రన్ల సుఖోయ్ ఫైటర్లకు బ్రహ్మోస్ ఏను అమర్చాలని ఐఏఎఫ్ భావిస్తోంది. ఇది పూర్తయితే పాకిస్థాన్ ట్రై సర్వీసెస్ ను చూసే కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లు, టెర్రరిస్టు ప్రభావిత ప్రాంతాలు, న్యూక్లియర్ ఆయుధగారాలు, రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టులు, డ్యామ్స్ ఐఏఎఫ్ పరిధిలోకి వచ్చేస్తాయి. బ్రహ్మోస్ లోని అతి తక్కువ వెర్షన్ ను మిగ్–29కే, రాఫెల్, మిరేజ్–2000, తేజస్ ఫైటర్లకు ఫిట్ చేయాలని ఐఏఎఫ్ నిర్ణయించింది.