హిమాచల్ సీఎంగా సుఖ్విందర్​ ప్రమాణం

హిమాచల్ సీఎంగా సుఖ్విందర్​ ప్రమాణం

షిమ్లా : హిమాచల్​ప్రదేశ్ 15వ సీఎంగా సుఖ్విందర్​సింగ్​ సుఖు, డిప్యూటీ సీఎంగా ముకేశ్ అగ్నిహోత్రి ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్​ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్​ ఇద్దరితో ప్రమాణం చేయించారు. సిమ్లాలోని రాజ్​భవన్​లో జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ చీఫ్​ మల్లికార్జున్​ ఖర్గే, రాహుల్​ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు చత్తీస్​గడ్​, రాజస్థాన్ సీఎంలు అశోక్​ గెహ్లాట్, భూపేశ్​ బాఘేల్, మాజీ కేంద్ర మంత్రి ఆనంద్​శర్మ, హర్యానా మాజీ సీఎం భూపిందర్ సింగ్​ హుడా హాజరయ్యారు. అనంతరం హిమాచల్​ప్రదేశ్​కు 6 సార్లు సీఎంగా సేవలందించిన రాజవంశీకుడు దివగంత వీరభద్ర సింగ్‌కి లీడర్లంతా నివాళులర్పించారు. వేదికపైనే ఉన్న వీరభద్ర సింగ్‌ భార్య ప్రతిభా సింగ్‌ను రాహుల్‌ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ వేడుకలో సుఖ్విందర్​ తల్లి, భార్యతో పాటు కూతుళ్లు హాజరయ్యారు.

ప్రతిభా సింగ్​ ఇంటికెళ్లి ఆహ్వానించిన సుఖు

ప్రతిభా సింగ్ ఇంటికెళ్లి  ప్రమాణ స్వీకారోత్సవానికి రావాల్సిందిగా సుఖ్విందర్​ సింగ్ సుఖు ఆదివారం ఉదయం ఇన్విటేషన్ ఇచ్చారు. ఆమె లీడర్​షిప్​లోనే ప్రభుత్వం పని చేస్తుందని మీడియాతో సుఖు చెప్పారు. అయితే, అందరికంటే చివరగా ప్రతిభా సింగ్​ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. ఆమెకు రాహుల్, ప్రియాంక గాంధీలు ఘనంగా స్వాగతం పలికారు. కాగా, హిమాచల్​లో కాంగ్రెస్​ అధికారంలోకి రావడంతో పార్టీ కార్యకర్తల్లో జోష్​ వచ్చిందని, త్వరలో 12 మందితో  మంత్రివర్గం ఏర్పాటు చేస్తామని  భూపిందర్ సింగ్​ హుడా తెలిపారు.

ప్రధాని మోడీ శుభాకాంక్షలు

హిమాచల్‌ కొత్త సీఎంగా బాధ్యతలు చేపట్టిన సుఖ్విందర్​కు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు చెప్పారు. హిమాచల్ అభివృద్ధికి కేంద్రం నుంచి అన్నివిధాలా సహకారం ఉంటుందని హామీ ఇస్తూ ఆయన ట్వీట్‌ చేశారు. టిబెటన్​ ఆధ్యాత్మిక గురువు దలైలామా కూడా సుఖుకు కంగ్రాట్స్​ చెప్పారు. ‘‘ఇండియాతో నాకు 62 ఏండ్ల అనుబంధం ఉంది. హిమాచల్​లోని ధర్మశాలలో ఎక్కువ టైం గడిపాను. సుఖు సీఎం కావడం సంతోషంగా ఉంది. హిమాచల్​లోని అన్ని వర్గాల ప్రజలు నాతో పాటు ఉన్న టిబెటన్లకు ఆతిథ్యం ఇచ్చారు. ఎప్పటికీ మరిచిపోలేను’’అని  దలైలామా గుర్తు చేశారు.   

లోయర్​ హిమాచల్​ నుంచి రెండో సీఎం

అప్పర్​ హిమాచల్​ప్రదేశ్​ నుంచి కాంగ్రెస్​ తరఫున వైఎస్​ పర్మార్, వీరభద్ర సింగ్, రామ్​లాల్​ ఠాకూర్​ సీఎంగా సేవలందించారు. లోయర్​ హిమాచల్​ప్రదేశ్​ నుంచి సీఎంగా ఎన్నికైన రెండో వ్యక్తిగా సుఖ్విందర్​ నిలిచారు. 

జర్నలిస్ట్​ నుంచి డిప్యూటీ సీఎంగా అగ్నిహోత్రి..

డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ముకేశ్​ అగ్నిహోత్రి జర్నలిస్ట్​గా పని చేశారు. బ్రాహ్మణ కులానికి చెందిన ఆయన, ఉనా జిల్లా హరోలీ నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన తండ్రి ఓంకార్​ శర్మ రాజకీయాల్లో సక్సెస్​ కాలేకపోయారు. 1988లో హరోలీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. చివరికి డీపీఆర్వోగా రిటైర్​మెంట్​ తీసుకున్నారు. వీరభద్ర సింగ్​కు సన్నిహితుడు. కాగా, హమీర్‌పుర్‌ జిల్లా నదౌన్‌ నుంచి సుఖ్విందర్​ సింగ్​ 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.