ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

పుల్కల్, వెలుగు :  చౌటకూర్ మండలంలోని సుల్తాన్ పూర్ గ్రామ పల్లె ప్రకృతి వనం నిర్వహణ బాగుందని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం ప్రకృతి వనాన్నిఆయన ఆకస్మికంగా సందర్శించారు. 161 హైవే పక్కన ఉన్నందున ప్రయాణికులు సేదతీరేందుకు కనీస సౌకర్యాలు కల్పించాలని, గ్రామ మహిళా సంఘల ద్వారా టీ పాయింట్ ఏర్పాటు చేయాలని ఎంపీడీవో మధులతకు కలెక్టర్​ సూచించారు.  ప్రతి గ్రామ ప్రకృతి వనాలలో మొక్కలు దగ్గరగా నాటి అభివృద్ధి చేయాలన్నారు.  కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ రాజర్జి షా, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాసరావు, డీపీవో సురేశ్ ​మోహన్, జిల్లా పరిషత్ సీఈవో ఎల్లయ్య, మండల తహసీల్దార్ కిష్టయ్య, ఎపీవో సంతోశ్​ పాల్గొన్నారు. 

ప్రతి గింజా కొంటాం

మెదక్/జిన్నారం, వెలుగు : రైతులు పండించే ప్రతి గింజా కొంటామని మెదక్, పటాన్​చెరు ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్​రెడ్డి, గూడెం మహిపాల్​రెడ్డి అన్నారు. శుక్రవారం హవేలి  ఘనపూర్  మండలం బూర్గుపల్లిలో పద్మాదేవేందర్​రెడ్డి, జిన్నారం మండలం ఊట్ల, సొలక్ పల్లి, జిన్నారం, నల్తూరు, వావిలాల గ్రామాలలో  మహిపాల్​రెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని సీఎం కేసీఆర్​ రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారన్నారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్, రైతుబంధు, ఎరువులు, విత్తనాలు, సాగునీరు  సకాలంలో అందించడంతో పంటలు బాగా పండి మంచి దిగుబడి వస్తోందన్నారు. ధాన్యం మొత్తం కొనుగోలు  చేసేందుకు వీలుగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.

అదృశ్యమైన యువకుడు బావిలో శవమై..

రామాయంపేట, వెలుగు : రామాయంపేటలో మూడు రోజుల కింద మిస్సింగ్ అయిన యువకుడు మెదక్ రోడ్డు ప్రక్కన పాడు బడిన బావిలో శవమై తేలాడు. స్థానిక ఎస్సై రాజేశ్​ తెలిపిన ప్రకారం.. రామాయంపేట పట్టణానికి చెందిన రావిశెట్టి సిద్ధిరాములు కుమారుడు ప్రశాంత్ (20) మంగళవారం బయటకు వచ్చి రాత్రి వరకు ఇంటికి వెళ్లలేదు. అతడి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు గాలిస్తున్నారు. ఈ క్రమంలో పట్టణంలోని మెదక్ రోడ్డులో ఉన్న ఓ పాత బావిలో ప్రశాంత్​ డెడ్​ బాడీని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.  వారు అక్కడికి చేరుకుని ఫైర్ ఇంజన్ తో బావిలో నుంచి నీటిని తోడి డెడ్​బాడీని బయటకు తీశారు. అతడు ప్రమాదవశాత్తు బావిలో పడి ఉంటాడని భావిస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

భారత్ జోడో యాత్రను సక్సెస్ చేయాలి

నర్సాపూర్, వెలుగు : ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్రలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సక్సెస్ చేయాలని టీపీసీసీ కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి, అధికార ప్రతినిధి ఆంజనేయులు గౌడ్, రాష్ట్ర నాయకుడు రవీందర్ రెడ్డి  పిలుపునిచ్చారు. శుక్రవారం నర్సాపూర్ లోని సాయి కృష్ణ గార్డెన్ లో నిర్వహించిన నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను జూడో యాత్ర ద్వారా ప్రజలకు చెప్పాలన్నారు. నవంబర్ 3న సంగారెడ్డి జిల్లా ఎంఎన్​ఆర్​ చౌరస్తా వద్ద యాత్ర కు  పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వాగతం పలకాలన్నారు. అదే రోజు సాయంత్రం శివంపేట లో ఏర్పాటు చేస్తున్న భారీ బహిరంగ సభను సక్సెస్​ చేయాలని కోరారు. 

చోడో నఫ్రత్.. జోడో భారత్.. 

నారాయణ ఖే, వెలుగు : ‘చోడో నఫ్రత్.. జోడో భారత్’ అనే నినాదంతో రాహుల్ గాంధీ యాత్ర కొనసాగుతుందని టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ సురేశ్ ​షెట్కార్ అన్నారు. శుక్రవారం ఖేడ్ నియోజకవర్గం కల్హేర్, పెద్ద శంకరంపేట మండలాల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్త సమావేశానికి ఆయన హాజరయ్యారు. యాత్రకు సంబంధించిన పోస్టర్​ను ఆవిష్కరించి పలు సూచనలు చేశారు. 

యాత్ర ఏర్పాట్లు పరిశీలించిన గీతారెడ్డి 

పుల్కల్, వెలుగు : నవంబర్​ 3న అందోల్ నియోజకవర్గంలోకి చేరుకుంటున్న భారత్ జోడో పాదయాత్రకు సంబంధించి ఎంఎన్ ఆర్ చౌరస్తా నుంచి శివంపేట గ్రామం వరకు చేస్తున్న ఏర్పాట్లను మాజీ మంత్రి గీతారెడ్డి శుక్రవారం పరిశీలించారు. సుల్తాన్ పూర్ వరకు పాదయాత్ర కొనసాగి రాత్రి అక్కడే బస చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆమె తెలిపారు. 

పొన్నాల శివారులో గంజాయి మొక్కలు స్వాధీనం

సిద్దిపేట రూరల్, వెలుగు: సిద్దిపేట అర్బన్ మండల పరిధిలోని పొన్నాల గ్రామ శివారులో ఉన్న ఓ వ్యవసాయ పొలంలో గంజాయి మొక్కలను గుర్తించినట్లు టాస్క్ ఫోర్స్ సీఐ దిలీప్ కుమార్ తెలిపారు. పొన్నాల గ్రామానికి చెందిన మచ్చ రాజిరెడ్డి తన పొలంలో అక్రమంగా గంజాయి మొక్కలు పెంచుతున్నాడని పక్కా సమాచారంతో శుక్రవారం తనిఖీ చేశామన్నారు. ఐదు గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకుని త్రీ టౌన్ పోలీసులకు అప్పగించినట్లు చెప్పారు.  త్రీటౌన్ సీఐ భాను ప్రకాశ్​ కేసు విచారణ చేపట్టి నిందితుడిని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు పంపించారు. 

ఇంటికి దూరంగా ఉండలేక..  స్టూడెంట్ సూసైడ్

సిద్దిపేట రూరల్, (చిన్నకోడూరు) వెలుగు : ఇంటికి దూరంగా హాస్టల్ లో ఉండి చదువుకోవడం ఇష్టం లేక ఓ స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల పరిధిలోని చంద్లాపూర్ గ్రామంలో జరిగింది. ఎస్సై శివానందం తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన పురమాండ్ల వికాస్ రెడ్డి(18) హైదరాబాద్ లోని మియాపూర్ శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుకుంటున్నాడు. దీపావళి సెలవుల సందర్భంగా ఈ నెల 22న గ్రామానికి వచ్చాడు. ఐదు రోజులపాటు ఇంటి వద్ద ఉన్న అతడు కాలేజీకి వెళ్లడం ఇష్టం లేదని, హాస్టల్ లో ఉండలేకపోతున్నానని పలుమార్లు తల్లిదండ్రులతో చెప్పాడు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం కుటుంబ సభ్యులు పొలం పనుల్లో ఉండగా వారికి వికాస్ రెడ్డి ఫోన్ చేసి తాను ఇంట్లో పురుగుల మందు తాగుతున్నట్లుగా చెప్పాడు. వెంటనే తల్లిదండ్రులు వచ్చి చూసేసరికి అపస్మారక స్థితిలో ఉన్నాడు. అతడిని తొలుత సిద్దిపేట ప్రభుత్వ హాస్పిటల్ కు, ఆ తర్వాత హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయాడు. మృతుడి తండ్రి పురమాండ్ల అంజిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

ఆత్మీయ సమ్మేళనానికి రావాలని ఆఫీసర్లకు ఆహ్వానం

కోహెడ, వెలుగు : కోహెడ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించే 1993–94 బ్యాక్​ టెన్త్​  స్టూడెంట్ల ఆత్మీయ సమ్మేళనానికి రావాలని జిల్లా అడిషనల్​ కలెక్టర్​ పీ.శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్​ డీసీపీ సందెపోగు మహేందర్​ను ఆహ్వానించినట్లు నిర్వాహకులు కోహెడ లైన్స్ క్లబ్ చైర్మన్  బైరినేని సుకుమార్ రావు, అర్శనపల్లి ముని, గాదాసు రాజేందర్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం వారిని కలిసి ఆహ్వాన పత్రికను అందజేసినట్లు చెప్పారు. గతంలో ఈ ఇద్దరు అధికారులు ఈ ప్రాంతంలో ఒకరు తహసీల్దార్, మరొకరు ఎస్సైగా విధులు నిర్వహించారని తెలిపారు. వీరితోపాటు గురువులు, ఆత్మీయ విద్యార్థులు  హాజరై కార్యక్రమాన్ని సక్సెస్​ చేయాలని కోరారు.

పత్తి సాగుతో అధిక లాభాలు

చేర్యాల, వెలుగు : పత్తి సాగుతో రైతులు అధిక దిగుబడులు సాధించి ఎక్కువ లాభాలు పొందొచ్చని జిల్లా వ్యవసాయాధికారి శివప్రసాద్​ అన్నారు. శుక్రవారం మండలంలోని తాడూరు గ్రామంలో అధిక సాంద్రత పత్తి సాగు చేసిన రైతులతో క్షేత్ర ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూజివీడు కంపెనీ వారి అధిక సాంద్రత పత్తి రకం విన్నర్​ సాగు చేయడంతో ఒకేసారి పత్తి కాపునకు వచ్చి కూలి ఖర్చు తగ్గుతుందన్నారు.  పురుగు ఉధృతిని తట్టుకొని మందుల వాడకం తక్కువగా ఉంటాయన్నారు. ఈ పత్తి రకానికి ప్రభుత్వం ప్రోత్సాహకంగా ఎకరానికి రూ. 4వేలు అందిస్తోందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్​ నర్ర ప్రేమల మహేందర్​రెడ్డి, ఏడీఏ రాధిక, ఏఓ అఫ్రోజ్​, గుర్జకుంట, మర్రిముచ్చాల, చిట్యాల గ్రామాల రైతులు పాల్గొన్నారు. 

బీజేవైఎం ఆధ్వర్యంలో నిరసన

కోహెడ(హుస్నాబాద్​), వెలుగు : ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో అధికారపార్టీ తీరును నిరసిస్తూ  బీజేవైఎం ఆధ్వర్యంలో శుక్రవారం అక్కన్నపేట మండల కేంద్రంలో సీఎం కేసీఆర్​దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కర్ణకంటి నరేశ్​ మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీకి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక సీఎం కేసీఆర్ ప్రగతి భవన్​ అడ్డాగా ఎమ్మెల్యే కొనుగోలు విషయాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై వెంటనే సీబీఐతో విచారణ  జరిపించాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో నాయకులు మోహన్ నాయక్, దాసరి కృష్ణ, సంపత్, అనిల్, యాదగిరి పాల్గొన్నారు.

పెంచిన ఫీజులు తగ్గించాలి

సంగారెడ్డి టౌన్, వెలుగు: ఇంజనీరింగ్ కాలేజీలో పెంచిన ఫీజులను తగ్గించాలని, పెండింగ్ లో ఉన్న స్కాలర్​షిప్, ఫీజు రీయింబర్స్​మెంట్ ​విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్​ చేశారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్ ఏవో స్వర్ణలతకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్​ఎఫ్​ఐ జిల్లా కార్యదర్శి రమేశ్​ మాట్లాడుతూ పెంచిన ఫీజులు కట్టలేక పేద, మధ్యతరగతి విద్యార్థులు పై చదువులకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్, కాస్మోటిక్ చార్జీలు పెంచాలని కోరారు. విద్యార్థులు సీజనల్ వ్యాధులకు గురికాకుండా సంక్షేమ వసతి గృహాలలో ఏఎన్ఎం లను నియమించాలన్నారు. జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని, ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు రవి, సాయి, బన్నీ, శ్రీకాంత్, సాయికుమార్ ఉన్నారు.

కరుణ స్కూల్ గుర్తింపు రద్దు చేయాలి

సంగారెడ్డి టౌన్, వెలుగు : లైంగిక వేధింపులకు అడ్డాగా మారిన కరుణ హై స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో శుక్రవారం డీఈవోకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ శ్రీకాంత్ సాగర్ మాట్లాడుతూ సంగారెడ్డి పట్టణంలోని కరుణ హైస్కూల్లో విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడి వారం రోజులు గడిచినప్పటికీ సంబంధించిన పాఠశాలపై ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం విచారకరమన్నారు. హిందువుల విద్యార్థులను బొట్టు, చేతికి ఉన్న గాజులను తీసేసి పాఠశాలలకు రావాలని యాజమాన్యం హెచ్చరించడం అధికారుల వైఫల్యానికి నిదర్శనమన్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు.  లేకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏబీవీపీ స్టూడెంట్ ఫర్ డెవలప్మెంట్ రాష్ట్ర కన్వీనర్ చంద్రశేఖర్, శశాంక్, దినేశ్​,  శ్రీకాంత్ మహేశ్ ​తుల్జారాం ఉన్నారు. 

మట్టి తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి

కొండాపూర్, వెలుగు : కొండాపూర్ లో అక్రమంగా మట్టిని తరలిస్తున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి  చంద్ర మోహన్ డిమాండ్​ చేశారు. శుక్రవారం గిర్మాపూర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.  కొండాపూర్  ప్రభుత్వ భూమిలో అక్రమంగా మట్టిని తోగర్ పల్లి శివారులోని ఓ వెంచర్ నిర్మాణానికి తరలిస్తున్నా అధికారులు చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని, లేకపోతే కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.