కర్ణాటకలోని మాండ్య లోక్ సభ నుంచి సిట్టింగ్ ఎంపీ సుమలత పోటీపై సందిగ్దత నెలకొంది. 2019 లోక్ సభ ఎన్నికల్లో మాండ్యా నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగిన సుమలతకు బీజేపీ మద్దతు తెలిపింది. ఈ ఎన్నికల్లో సుమలత విజయం సాధించింది. అయితే ఈ సారి లోక్ సభ ఎన్నికల్లో జేడీయూ, బీజేపీ కలిసి పొటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా మాండ్య లోక్ సభ స్థానాన్ని జేడీయూకు కేటాయించింది బీజేపీ. అక్కడ కుమార స్వామి బరిలోకి దిగనున్నారు.
ఈ క్రమంలో సుమలత మాండ్యా నుంచి పోటీ చేస్తారా? లేదా కుమార స్వామికి మద్దతిస్తారా? అనేది ప్రస్తుతం చర్చ నీయాంశంగా మారింది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా సుమలత మాండ్యా ఎంపీగా బరిలోకి దిగాలని ప్రయత్నిస్తోంది. ఇటీవల కేంద్రంలోని బీజేపీ పెద్దలతో భేటీ అయ్యారు. మాండ్యా లోక్ సభ సీటు తనకు కేటాయించాలని కోరారు.
అయితే మార్చి 30న బీజేపీ కర్ణాటక చీఫ్ విజయేంద్ర సుమలతతో భేటీ అయ్యారు. మాండ్యా సీటు కుమార స్వామికి కేటాయించినందున సుమలత మద్దతు కోరారు. కానీ సుమలత జేడీయూకు మద్దతిచ్చే అంశంపై ఎలాంటి నిర్ణయం చెప్పలేదు. తన మద్దతుదారులు, అభిమానులతో సమావేశమై..వారితో చర్చించి ఇండిపెండెంట్ గా పోటీ చేయాలా? లేక మద్దతివ్వాలా? అనేదానిపై ఏప్రిల్ 3న వెల్లడిస్తానని చెప్పారు.
