- బీఆర్ఎస్ కు తన మద్దతని ప్రకటన
- పోటీ చేస్తారా..? ప్రచారానికే పరిమితమా?
- ఆంధ్ర నుంచా..? తెలంగాణ నుంచా..?
హైదరాబాద్: సినీ హీరో సుమన్ పాలిటిక్స్ లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. తాను బీఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించిన సుమన్.. ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారనేది చర్చనీయాంశంగా మారింది. ఏపీలో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతారా..? లేదా తెలంగాణలో పోటీ చేస్తారా..? అనేది హాట్ టాపిక్ గా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సుమన్.. ఈ సారి ప్రత్యక్ష ఎన్నికల్లో తప్పక పోటీ చేస్తారని తెలుస్తోంది. ఏపీలోని బాపట్ల జిల్లా రేపల్లె సెగ్మెంట్ లో తన (గౌడ్) సామాజిక వర్గం బలంగా ఉండటంలో అక్కడి నుంచి వైసీపీ తరఫున పోటీ చేస్తారని మొన్నటి వరకు ప్రచారం జరిగింది.
ఈ నేపథ్యంలో తాను బీఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్నట్టు నిన్న సుమన్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. బీఆర్ఎస్ తరఫునైతే తెలంగాణలో గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సుమన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. బీజేపీతో రాజకీయ అరంగేట్రం చేసిన సుమన్.. పలు ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత 2017 వరకు టీడీపీకి మద్దతుదారుగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఏపీ లో ఏదో ఓ సెగ్మెంట్ నుంచి పోటీ చేయాలని భావించారు. అది సాధ్యం కాకపోవడంతో పార్టీకి దూరంగా ఉన్నారు. ఆ తర్వాత ఏపీలో జగన్ జగన్ పథకాలను పొగడుతూ వచ్చారు. దీంతో సుమన్ వైసీపీలో చేరబోతున్నారంటూ ప్రచారం కూడా జరిగింది. ఆ తర్వాత జనసేనలో చేరుతున్నారనే రూమర్లు కూడా వచ్చాయి.
బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం , కోమటితిప్ప గ్రామంలో ఒక ప్రైవేట్ కార్యక్రమానికి సుమన్ హాజరయ్యాడు. అక్కడి కాపునాడు అధ్యక్షుడు సత్తినేని శ్రీనివాస తాతాజీ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుమన్ మాట్లాడుతూ.. తానూ తప్పకుండా రాజకీయాల్లోకి వస్తానని, బీఆర్ఎస్ సిద్ధాంతాలు బాగా నచ్చాయని, తన మద్దతు ఆ పార్టీకే అని ప్రకటించారు. దీంతో సుమన్ పొలిటికల్ రీ ఎంట్రీపై క్లారిటీ వచ్చింది. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న సుమన్ ఏ సెగ్మెంట్ నుంచి పోటీ చేయబోతున్నారనే చర్చ సినీ, పొలిటికల్ సర్కిల్స్ లో మొదలైంది.